Fathers Day 2022: ఫాదర్స్ డే పుట్టుక వెనుక గుండెలు బరువెక్కే చరిత్ర, మనసు కరగాల్సిందే
తండ్రి బిడ్డల కోసం పడుతున్న కష్టానికి ధన్యవాదాలు తెలుపుకునే దినోత్సవం ‘ఫాదర్స్ డే’.
నాన్నంటే బాధ్యత, నాన్నంటే నమ్మకం, నాన్నంటే భరోసా... ఇలా చెప్పుకుంటూ పోతే బిడ్డల భవిష్యత్తు కోసం తన జీవితం మొత్తాన్ని ధారపోసే గొప్ప వ్యక్తి తండ్రి. అలాంటి తండ్రికి ఓ రోజును అంకితం చేసింది ప్రపంచ సమాజం. ప్రతి ఏడాది ఆగస్టులో మూడో ఆదివారాన్ని నాన్నల గౌరవార్ధం ‘ఫాదర్స్ డే’గా నిర్వహించుకుంటాం. ఈ సారి జూన్ 19న ఫాదర్స డే వచ్చింది. ఈ ప్రత్యేక దినోత్సవం పుట్టి వందేళ్లకు పైగా దాటింది. దీని పుట్టుక వెనుక గుండెలు బరువెక్కే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి మోనోంగా ట్రాజెడీ.
వేయి మంది అనాథలయ్యారు
అమెరికాలోని వెస్ట్ వర్జినియాలో ఉంది మోనోంగా గని. ఇందులో ఎంతో మంది పనిచేస్తున్నారు. 1907, డిసెంబర్ 6న ఆ గనిలో పెద్ద ప్రమాదం జరిగింది. దాదాపు 361 మంది మరణించారు. వారిలో 250 మంది పిల్లలున్న తండ్రులే. ఈ ఘటన తరువాత దాదాపు వేయి మంది పిల్లలు తండ్రి లేని వారయ్యారు. అలాంటి పిల్లల్లో ఒకరు గ్రేస్ గోల్డెన్ క్లేటన్. ఆమె తన తండ్రి స్మారకంగా స్థానిక చర్చిలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయించింది. కానీ ఆ కార్యక్రమం ఏటా జరగాలని భావించినా అలా జరుగలేదు. రెండేళ్ల తరువాత 1909లో వాషింగ్జన్ కు చెందిన సొనొరా లూయిస్ స్మార్ట్ డోడ్ అనే మహిళ తండ్రుల గౌరవార్ధం ప్రత్యేకంగా ఒక దినోత్సవం ఉండాలని భావించింది. ఆ భావన కలిగేలా చేసింది ఆమె తండ్రే. భార్య చనిపోయినా కూడా తన అయిదుగురు పిల్లలను ఎంతో కష్టపడి పెంచాడు. ఎంతో మంది రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా ఆయన వినలేదు. ఇంట్లో పనులు దగ్గర్నుంచి, పిల్లల్ని చదివించడం, వారి గురించి సంపాదించడం వరకు ఆయన ఎంతో కష్టపడ్డాడు. తన తండ్రి కష్టాన్ని చూసిన సొనొరా అతనిలాంటి తండ్రులను అంతర్జాతీయ సమాజం గౌరవించాలని కోరుకుంది. అలా మొదటి ఫాదర్స్ డే జూన్ 19, 1910లో జరిగింది.
కాలం గడిచేకొద్దీ ఫాదర్స్ డే మెల్లగా పాపులర్ కావడం మొదలైంది. అనేక దేశాలకు పాకింది. 1966లో అమెరికా ప్రెసిడెంట్ ప్రతి ఏడాది ఆగస్టు మూడో ఆదివారం ఫాదర్స్ డే నిర్వహించాలని అధికారికంగా ప్రకటించారు. ఈ రోజున పిల్లలు తమ తండ్రులు విషెస్ చెప్పడంతో పాటూ, వారికి ఏదైనా బహుమతిని అందిస్తారు. ప్రపంచంలో దాదాపు వందకు పైగా దేశాలు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు అధికంగా వాచీలు, కొత్త షర్టులు, ఖరీదైన పెన్నులు వంటివి కొనిస్తారు.
మరికొన్ని ఆసక్తికర అంశాలు..
1. ప్రపంచంలో అధికంగా గ్రీటింగ్ కార్డులు పంపే దినోత్సవాల్లో ఫాదర్స్ డే ది నాల్గవ స్థానం. ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87 మిలియన్ కార్డులు అమ్ముడవుతాయి.
2. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ దేశాల్లో ఫాదర్స్ డేని మార్చి 19న నిర్వహించుకుంటారు. ఆ సెయింట్ జోసెఫ్ ని కొలుస్తారు.
3. ఫాదర్స్ డేను నిర్వహించుకున్న మొదటి దేశం అమెరికా.
4. ‘డాడ్’ అనే పదం వాడుకలోకి వచ్చింది 1500 ఏళ్ల క్రితం అని చెబుతారు.
5. ఫాదర్స్ డే రోజు ఇవ్వాల్సిన పువ్వు ‘గులాబి’.
Also read: దీపిక పదుకోన్ ఆరోగ్య సమస్య ఇదే, అందుకే ఆసుపత్రికి వెళ్లింది, ఈ సమస్య ఎవరికైనా రావచ్చు
Also read: సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? ఈ ఆహారాలు మీకు సహాయపడతాయి