Sesame Seeds: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే
శీతాకాలం వచ్చేసింది... సాయంత్రం ఆరు నుంచే చలి చంపేస్తోంది. ఈ కాలంలో కాస్త శరీరానికి వేడినిచ్చే ఆహారం అవసరమే.
వాతావరణం ఒకేసారి చల్లగా మారిపోయింది. సాయంత్రం ఆరు దాటితే బయటికి వెళ్లలేనంత చలి. ఈ చలికాలంలో అనేక వ్యాధులు చుట్టుముడతాయి. వాటిని తట్టుకోవాలంటే శరీరానికి కాస్త వేడినిచ్చే ఆహారం అవసరం. అంటే వేడివేడిగా ఉండే ఆహారం తినడం కాదు, చలిని తట్టుకునే శక్తినిచ్చే ఆహారాన్ని అందివ్వాలి. అందుకు నువ్వులు మంచి ఎంపిక.
నువ్వుల శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహకరిస్తాయి. నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, నువ్వుల పచ్చడి, వేపిన నువ్వులు, పచ్చినువ్వులు... ఇలా ఏ రూపంలో వీటిని తీసుకున్నా మంచిదే. వారానికి కనీసం మూడు సార్లు వీటిని తినడం అలవాటు చేసుకుంటే మంచిది. వీటిలో ఇనుము కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి రక్త హీనత సమస్యతో బాధపడేవారికి కూడా ఇవి మేలు చేస్తాయి. వీటిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణగా ఉంటాయి.
నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎదిగే పిల్లలకు వీటిని తినిపించడం చాలా మంచిది. ఎముకలు గట్టిగా మారతాయి. ఫైబర్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తవు. కొన్ని క్యాన్సర్లను కూడా ఇవి అడ్డుకుంటాయి. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వంటి వారికి నువ్వులు తింటే ఎంతో కొంత మేలు జరుగుతుంది.
రక్తపోటు ఉన్నవారు నువ్వులను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. వీటిలో విటమిన ఇ అధికంగా ఉంటుంది. మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గిస్తాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి