Vitamin E: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ
జుట్టు ఊడిపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎవరిని అడిగినా కచ్చితంగా జుట్టు రాలిపోతోందని బాధపడుతుంటారు.
జుట్టు రాలకుండా కాపాడుకునేందుకు, ఒత్తుగా పెరిగేందుకు చాలా చిట్కాలు పాటిస్తుంటారు చాలా మంది. అయినా సరే జుట్టు పెరగడం మాట అటుంచితే, ఊడడం మాత్రం ఆగదు. అలాంటివారికి విటమిన్ ఇ వల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది. జుట్టు ఎదుగుదలకు కావాల్సిన పోషకపదార్థం ఇది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది కాబట్టి కుదుళ్ల నుంచి రిపేర్ చేసి, వెంట్రుకలు ఊడకుండా చేయడమే కాదు, కొత్త వెంట్రుకల పుట్టుకకు కారణమవుతంది. వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది.
ఒత్తిడి కూడా కారణమే
ఆధునిక కాలంలో ఒత్తిడి కూడా జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణంగా మారుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటూ విటమిన్ ఇ ఆయిల్ తలకు తరచూ పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పలు అధ్యయనాలలో కూడా ఈ విటమిన్ జుట్టు సమస్యలకు చెక్ పెడుతుందని తేలింది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా విటమిన్ ఇను వాడుకోవచ్చు. వెంట్రుకలకు మెరుపు అందించడంలో కూడా ఇది ముందుంటుంది. శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా మారతాయి.
జుట్టు ఎందుకు రాలుతుంది?
వెంట్రుకలు రాలిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలను చెప్పుకోవచ్చు. కుదుళ్లలో పీహెచ్ బ్యాలెన్స్ సరిగా లేకపోయినా వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే అక్కడ సహజపద్ధతిలో నూనె ఉత్పత్తి కాకపోయినా జుట్టు ఊడిపోతుంది. ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టగల సత్తా విటమిన్ ఇ కు ఉంది. విటమిన్ ఇ ఆయిల్ రాసుకోవడం మొదలుపెట్టాక కొన్ని రోజుల్లోనే మీకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
విటమిన్ ఇ ఎలా లభిస్తుంది?
1. విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న హెయిర్ ఆయిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని కొని వాడినా మంచి ఫలితం ఉంటుంది. ఆ నూనెలో కాస్త అవకాడో లేదా ఆముదం నూనె కూడా కలిపి రాసుకుంటే ఇంకా మంచిది.
2. విటమిన్ ఇ సప్లిమెంట్లు కూడా అమ్ముతున్నారు. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకోవచ్చు.
3. షాంపూలు, హెయిర్ కండిషనర్లు వంటివి ఎంచుకునేటప్పుడు విటమిన్ ఇ ఉన్నవి తీసుకోండి.
ఆహారం ద్వారా...
తినే ఆహారంలో కూడా విటమిన్ ఇ లభించే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పొద్దు తిరుగుడు పువ్వులోని విత్తనాలు, బాదం పప్పు, నట్స్, పిస్తా పప్పు, జీడిపప్పు, కివీ, మామిడి పండ్లు, అవకాడో, ఆప్రికాట్స్, బెర్రీలు, పాలకూర, బ్రకొలి వంటివాటిలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తింటుంటే మంచి ఫలితం ఉంటుంది. సహజసిద్ధంగా విటమిన్ ఇ జుట్టు కుదుళ్లకు అందుతుంది. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి