(Source: ECI/ABP News/ABP Majha)
Black pepper: మిరియాలను రోజూ వాడండి... ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు
రోజూ వంటల్లో నాలుగు మిరియాలు గింజలు వేయడం అలవాటు చేసుకోండి. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు.
మసాలా దినుసుల్లో మహరాజు మిరియాలు. వీటి వాడకం ఇప్పుడైతే తగ్గింది కానీ పాతకాలంలో అధికంగానే వాడేవారు. ప్రాచీన ఆరోగ్య గ్రంథం చరకసంహితంలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఆయుర్వేదం కూడా మిరియాలలోని సుగుణాలను గుర్తించింది. కానీ ఆధునిక ఆహారంలో మాత్రం మిరియాలను తినేవాళ్లు, వంటల్లో వాడే వాళ్లు చాలా తక్కువైపోయారు. నిజానికి మిరియాలు కొంచెంగా వాడినా చాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఎక్కువ వాడితే వాతం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు రెండు స్పూన్లకు మించి ఉపయోగించవద్దు.
1. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరకణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. పోషకాహార లోపం, ఎండలో బాగా తిరగడం, ధూమపానం, కాలుష్యం మొదలగు కారణాల వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ ఉత్పన్నమవుతాయి. వాటిని అంతమొందించడంలో యాంటీ ఆక్సిడెంట్లు ముందుంటాయి.
2. బీటా కెరాటిన్ వంటి పోషకాలను శరీరం శోషించుకునేందుకు మిరియాలు ఉపయోగపడతాయి.
3. మిరియాలలో ఉండే పైపరిన్ అనే కాంపోనెంట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
4. వీటిలో విటమిన్ ఏ, సి, కె లతో పాటూ మినరల్స్, మంచి ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
5. పాలల్లో కాస్త మిరియాల పొడి, పసుపు వేసుకుని తాగితే చాలా మంచిది. ఈ మిశ్రమం కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. అయితే అధికంగా తాగితే శరీరం వాతానికి గురవుతుంది.
6. మిరియాల పై పొరలో ఫైటో న్యూట్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వుల్ని విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల అనవసరంగా కొవ్వు పేరుకుపోదు. తద్వారా బరువు తగ్గొచ్చు.
7. మొటిమలకు మిరియాలు ఔషధంలా పనిచేస్తాయి. మిరియాల పొడిని మొటిమలపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. డెడ్ స్కిన్ కూడా పోతుంది.
కల్తీని ఎలా గుర్తించాలి?
మిరియాలలో కూడా కల్తీరకం మార్కెట్లోకి వస్తున్నాయి. ఏవి కల్తీవో తెలుసుకోవాలంటే చిన్న పరీక్ష చేస్తే సరి. దీనికోసం మిరియాలను వేళ్లతో గట్టిగా నలపడానికి ప్రయత్నించండి. మంచి మిరియాలు అంతత్వరగా ముక్కలు కావు. అవే కల్తీవి అయితే త్వరగా ముక్కలై పోతాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం
Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో
Also read: ఈ అలవాట్లే... మెదడు స్ట్రోక్‌కు కారణమవుతాయి