Mosquitos: దోమలు పెరిగిపోతున్నాయా? ఇంటి ముంగిట్లో ఈ మొక్కలు పెంచండి,
ఏ సీజన్ అయినా దోమలు మాత్రం పుష్కలంగా ఇంట్లో తిరుగుతాయి. వాటికి మొక్కలతో పరిష్కారం దొరుకుతుంది.
దోమల బెడద అందరిదీ. వానాకాలంలోనే కాదు, ఎండాకాలంలో కూడా ఇళ్లలో దోమలు చేరుతాయి. కాస్త నీడపట్టు, నీటి వసతి దొరికితే చాలు అక్కడే తిష్టవేసుకుని కూర్చుంటాయి. కొన్ని రకాల మొక్కలను ఇంటి పెరట్లో లేదా ఇంటి ముంగిట్లో పెంచుకుంటే దోమలు త్వరగా ఇంట్లోకి చేరవు. అంతేకాదు ఈ మొక్కలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే మొక్కలు.
బంతిపూల మొక్కలు
బంతిపూలు మొక్కలు పూలు పూయడానికి సీజన్ కావాలి కానీ, కుండీల్లో మొక్కగా బతికి ఉండడానికి ఏ సీజన్ అయినా ఫర్వాలేదు. నాలుగు కుండీల్లో బంతిపూల మొక్కలు వేసి ఇంటి గుమ్మానికి దగ్గర్లో, కిటికీలకి దగ్గర్లో పెట్టుకోవాలి. మరీ ఎండ తగిలే ప్రదేశంలో పెట్టకండి. బంతిపూల మొక్కల నుంచి వచ్చే వాసన దోమలకు కిట్టదు. ఆ పరిసరాల్లోకి కూడా రావు.
లావెండర్
ప్రతి నర్సరీలో దొరికే మొక్కే లావెండర్. చర్మ సౌందర్య ఉత్పత్తులలోనూ, స్ప్రేలలోనూ దీన్ని విరివిగా వాడుతుంటారు. ఈ మొక్క ఉన్నచోటకి కూడా దోమల్లాంటి కీటకాలు రావు. ఆ ఆకుల్లో ఉత్పత్తి అయ్యే ఆయిల్ వాటికి నచ్చదు. వెచ్చగా ఉండే సీజన్లో కూడా ఇవి పెరుగుతాయి.
పుదీనా
వంటల్లోకి పుదీనా చాలా అవసరం. దీన్ని పెంచుకుంటే దోమను తరిమి కొట్టడంతో పాటూ, వంటలకు కూడా ఉపయోగపడుతుంది. పుదీనా కాడను పాతినా మొలిచేస్తుంది కాబట్టి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇవి మొండిమొక్కలే ఒకసారి మొలిచాయంటే పెరుగుతూనే ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలు కూడా అధికం.
రోజ్ మ్యారీ
ఈ మొక్క పుదీనా జాతికి చెందినదే. చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో దీని వాడకం అధికం. దోమలను తరిమికొట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. బాల్కనీల్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. దోమలు అధికంగా ఉన్న చోట కుండీతో సహా ఈ మొక్కలను పెట్టండి. దోమలు పరారవ్వడం ఖాయం.
తులసి
తులసి మొక్క మీదుగా వీచే గాలి కూడా చాలా ఆరోగ్యం. తులసి మొక్కలను రెండు మూడు కుండీల్లో పెంచి ఇంటి గుమ్మం చుట్టూ పెట్టుకోండి. దోమలు అటునుంచే అటే పారిపోతాయి. దోమలకు ఈ మొక్క వాసన పడదు. అందుకే తులసి మొక్క ఉన్నచోట దోమలు కనిపించవు.
వెల్లుల్లి
వెల్లల్లి రెబ్బలను పాతేస్తే చాలు మొక్కలు మొలిచేస్తాయి. వీటిని కుండీల్లో పెంచినా కూడా వాటి చుట్టు పక్కల దోమలు కనిపించవు.
నర్సరీల్లో దొరికే ఇతర మొక్కలు ఉన్నాయి. అవంటే కూడా దోమలకు హడల్.సిట్రనెల్లా, లెమన్ బామ్, జెరానియం వంటి మొక్కలు ఇంట్లో ఉన్నా మంచిదే.
Also read: హైబీపీని కంట్రోల్ చేసే ఆహారాలు ఇవిగో
Also read: అప్పటికప్పుడు వేసుకునే ఇన్‌స్టెంట్ దోశ రెసిపీ, కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది