Healthy Recipe: శక్తినిచ్చే పుట్టగొడుగుల ఆమ్లెట్... చేయడం చాలా సులువు
ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ఆమ్లెట్‌ను ప్రయత్నించండి.
ఆమ్లెట్‌కు అభిమానులు ఎక్కువ. రోజూ తినేవాళ్లు కూడా లేకపోలేదు. ఎప్పుడూ ఒకేలాంటి ఆమ్లెట్ తింటే బోరుకొట్టేయదు. అప్పుడప్పుడు కొత్తగా కూడా ప్రయత్నించాలి. ఆమ్లెట్ పుట్టగొడుగులు చేర్చడం ద్వారా మరింత శక్తివంతమైన ఆహారంగా మారుతుంది. ఎన్నో పోషకాలు అందుతాయి. పిల్లలకు పెడితే చాలా మంచిది. గుడ్డు, పుట్టగొడుగులు రెండింటిలోనూ అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఈ రెంటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇక చలికాలంలో దీన్ని వేడివేడిగా లాగిస్తే ఆ మజానే వేరు.
కావాల్సిన పదార్ధాలు
గుడ్లు - మూడు
ఉల్లిపాయ - అరముక్క
కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూను
బటన్ పుట్టగొడుగులు - చిన్నవి ఆరు
బటర్ - ఒక టేబుల్ స్పూను
మిరియాల పొడి - పావు టీస్పూను
పచ్చిమిర్చి తరుగు - అర టీస్పూను
చీజ్ తరుగు - ఒక టేబుల్ స్పూను
తయారీ పద్దతి
1. పుట్టగొడుగులకు సన్నగా తరగాలి. ఉల్లిపాయను కూడా సన్నగా తురమాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త బటర్ వేయాలి. అందులో పుట్టగొడుగులు, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించాలి. పుట్టగొడుగులు తినడానికి వీలుగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లు పగులగొట్టి వేయాలి. అందులో ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి.
4. స్టవ్ మీద పెనం పెట్టి బటర్ రాయాలి. గుడ్ల సొన మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి.
5. ఒక నిమిషం ఆమ్లెట్ ఉడికాక పైన పుట్టగొడుగుల మిశ్రమాన్ని చల్లాలి. అలాగే చీజ్ తరుగును ఆమ్లెట్ మొత్తం చల్లాలి.
6. ఆమ్లెట్ కాలాక పైన కొత్తమీర తరుగును చల్లాలి.
7. స్టవ్ కట్టేసి ఆమ్లెట్ ను ప్లేటులో వేసి సర్వ్ చేయాలి. దీని రుచి మామూలుగా ఉండదు. తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
పోషకాలెన్నో...
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికీ తెలిసిందే. పోషకాహారం లోపం ఉన్న పిల్లలకు పుట్టగొడుగుల ఆమ్లెట్ పెడితే చాలా మంచిది. మాంసాహారంలో ఉన్న పోషకాలన్నీ పుట్టగొడుగుల్లో కూడా ఉంటాయి. పుట్టగొడుగుల్లో ఉండే ఫైబర్, పొటాషియం గుండెకు మేలుచేస్తాయి. పుట్టగొడుగులను బరువు తగ్గాలనుకునేవారు కూడా తినవచ్చు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రొస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నివారించడంలో ఇవి సహాయపడతాయి. మధుమేహరోగులకు పుట్టగొడుగులు ఎంతో మంచి చేస్తాయి. రక్తంలోని చక్కెరస్థాయిలను నియంత్రిస్తాయి. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
ఇక కోడిగుడ్డులోని పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువ. సంపూర్ణ ఆహారాంగా పిలిచేది దీన్నే. ఇక ఈ రెండింటి కాంబినేషన్లో ఆమ్లెట్ అంటే శరీరానికి ఎంతో మేలు చేసేది అవుతుంది. శక్తిని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారానికోసారైనా ఈ ఆమ్లెట్ వేసిస్తే మంచిది.