Esophageal Cancer : టీ, కాఫీలు వేడిగా తాగుతున్నారా? అయితే అలవాటును మార్చుకోండి, లేకుంటే క్యాన్సర్ వస్తుందట
Hot Beverages Linked to Higher Risk : చాలా వేడి పానీయాలు అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి అని UK బయోబ్యాంక్ పరిశోధన తెలిపింది. ఇది ఎంతవరకు నిజం?

Esophageal Cancer Risk with Hot Drinks : శీతాకాలం రాగానే వేడి టీ లేదా కాఫీ తాగడానికి, వేడి పదార్థాలు తినడానికి ఇష్టపడతారు. చలిని తగ్గించుకోవడానికి, శరీరానికి ఉపశమనం కోసం టీ లేదా కాఫీని ఎక్కువగా తాగేందుకు ఇష్టపడతారు. వీటిని ఒక్క సిప్ తాగగానే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అయితే ఒక కొత్త పరిశోధన అధ్యయనం ప్రకారం.. చాలా వేడిగా, అధిక ఉష్ణోగ్రత కలిగిన పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక (Esophagus)పై తీవ్రమైన, హానికరమైన ప్రభావం పడుతుందట. అన్నవాహిక క్యాన్సర్ (గ్రాసనలి లేదా భోజన నాళ క్యాన్సర్) వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేలింది.
UK Biobank పరిశోధన డిటైల్స్..
UK Biobank చేసిన ఒక పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తి చాలా వేడిగా, అధిక ఉష్ణోగ్రత కలిగిన పానీయాలు లేదా ఆహార పదార్థాలను సేవిస్తే.. శరీరంలో అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మన శరీరంలోని అన్నవాహికపై ఎక్కువ ప్రభావం పడుతుందట. దీనిని భోజన నాళం అని కూడా అంటారు. ఈ నాళం చాలా సున్నితంగా, మృదువుగా ఉంటుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రత కలిగిన పదార్థాలను సేవిస్తే ఇది సులభంగా దెబ్బతినవచ్చు. చాలా వేడిగా ఉండే టీ, కాఫీ లేదా ఏదైనా ఇతర ద్రవ పదార్థాలను నెమ్మదిగా గుక్కలు గుక్కలుగా తాగుతారు. కానీ ఈ హాట్ డ్రింక్స్ అన్నవాహికకు నష్టం, గాయం కలిగిస్తాయి. దీనివల్ల మన శరీర కణజాలం (tissue)పై కూడా ప్రభావం పడి.. దీనివల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అన్నవాహిక క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు
అన్నవాహిక క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే.. ఈ క్యాన్సర్ నుంచి రక్షణ పొందడం సాధ్యమవుతుంది.
- ఛాతీలో మంట
- ఛాతీలో నొప్పి
- నిరంతరంగా బరువు తగ్గడం
- గొంతులో ఆకస్మికంగా మార్పు రావడం
- రక్తంతో కూడిన దగ్గు
- ఆహారం మింగేటప్పుడు గొంతులో లేదా ఛాతీలో అడ్డం పడినట్లు అనిపించడం
- వాంతిలో రక్తం రావడం
అన్నవాహిక క్యాన్సర్ ఎలా పెరుగుతుంది?
రోజువారీగా వేడిగా, అధిక ఉష్ణోగ్రత కలిగిన పానీయాలు లేదా ద్రవ పదార్థాలను సేవిస్తే.. అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఎందుకంటే మన అన్నవాహిక చాలా మృదువుగా ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రత కలిగిన పదార్థాల వల్ల కలిగే మంటను, గాయాన్ని తట్టుకోలేదు. మనం పదేపదే చాలా వేడి పదార్థాలు తాగినప్పుడు.. అన్నవాహిక లోపలి పొర కాలిపోవచ్చు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే.. అది మన శరీర కణాలను దెబ్బతీయగలదు. దీనివల్ల అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















