Mutton Recipe: దోసకాయ మటన్ కర్రీ, వేడివేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు
మటన్ కర్రీని కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయాలనుకుంటున్నారా ఇలా చేయండి.
మటన్ కర్రీ, మటన్ వేపుడు, మటన్ బిర్యానీ... ఎప్పుడూ మటన్ రెసిపీలు ఇవేనా. కాస్త డిఫరెంట్‌గా ప్రయత్నిస్తే రుచికరమైన రెసిపీలు రెడీ అవుతాయి. మటన్ దోసకాయ కలిపి చేసే కర్రీ ఎంతో మందికి ఫేవరేట్. మీరు కూడా ఓసారి ప్రయత్నించి చూడండి. ఇదేం కాంబినేషన్ అని ముఖం తిప్పుకోవద్దు, ఓసారి వండుకుని తింటే తెలుస్తుంది... ఎందుకింతగా చెబుతున్నామో. ఎలా చేయాలో సింపుల్ రెసిపీ ఇక్కడ ఇచ్చాం. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే సరి.
కావాల్సిన పదార్థాలు
దోసకాయ - ఒకటి
మటన్ - పావుకిలో
ఉల్లిపాయ - ఒకటి
టోమాటో - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
గరం మసాలా - అర స్పూను
జీలకర్ర పొడి - అరస్పూను
నీళ్లు - తగినన్ని
నూనె - మూడు స్పూనులు
తయారీ ఇలా...
1. మటన్ చిన్న ముక్కలుగా కోసుకుని, పసుపు ఉప్పు వేసి బాగా కడగాలి.
2. మటన్ ను ముందుగానే కుక్కర్లో రెండు విజిల్స్ వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
3. దోసకాయ పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
4. విత్తనాలను తీసిపడేయాలి.
5. ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి.
6. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
7. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
8. అవన్నీ వేగితే మంచి సువాసన వస్తుంది. ఆ సమయంలో పసుపు, కారం వేసి వేయించాలి.
9. ఇప్పుడు మటన్ ముక్కలు కూడా వేసి వేయించాలి.
10. మటన్ కాసేపు ఉడికాక దోసకాయ ముక్కలు వేయాలి.
11. దోసకాయ ముక్కలు సగం ఉడికాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి.
12. ఉప్పు, నీళ్లు వేసి చిన్న మంటపై ఉడికించాలి.
13. గ్రేవీ దగ్గరగా అయ్యాక జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలపాలి.
14. ఓ అయిదు నిమిషాలు ఉడికాక పైన కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.
ఈ కూరని అన్నంలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు.
దోసకాయలో పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధికరక్తపోటు ఉన్న వారికి దోసకాయతో వండిన కూరలు తినడం చాలా అవసరం. ఇందులో ఉండే ఫిస్టిన్ అనే ఫ్లేవనాయిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో దోసలోని గుణాలు సహాయపడతాయి. అలాగే మటన్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే లక్షణాలు ఉన్నాయి. దీనిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. బి విటమిన్లు కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఎర్ర రక్తకణాలు పెరుగుదల కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వారానికోసారైనా దోసకాయ మటన్ కర్రీ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Also read: భూమ్మీద ఇప్పటివరకు పుట్టినవాళ్లలో అత్యంత ధనవంతుడు ఈయనే, పనివారికి కూడా బంగారు వస్త్రాలే
Also read: మాస్ హిస్టీరియాతో తలలు బాదుకున్న విద్యార్థులు, అసలేంటి ఈ హిస్టీరియా? ఎందుకు వస్తుంది?