Job: ఉద్యోగం నచ్చకపోయినా చేయాల్సిన పరిస్థితా? ఈ నాలుగు పనులు చేస్తే మీకంతా మంచే
చాలా మంది ఇష్టం లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరికీ ఈ కథనం వర్తిస్తుంది.
ఎంతో మందికి చేసే ఉద్యోగం నచ్చదు, అక్కడున్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషులు నచ్చరు... అయినా ఉద్యోగం విడిచి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లోని బాధ్యతలు గుర్తొచ్చి రిజైన్ చేయకుండా ఆగిపోతుంటారు. కానీ తమలో తామే నలిగిపోతుంటారు. మానసిక వేదనకు గురవుతుంటారు. అలా మీలో మీరే నలిగిపోవడం వల్ల అనేక మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక ఒత్తిడి కారణంగానే ఎక్కువ మంది ఉద్యోగాలను ఇష్టపడడం లేదని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగం నచ్చకపోయినా చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని పనులు చేయడం ద్వారా మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. సంతోషంగా ఉద్యోగం కూడా చేసుకోవచ్చు.
కొటేషన్లతో స్పూర్తి
మాటకు చాలా శక్తి ఉంది. కొన్ని మాటలు మనిషిని కుంగుబాటుకు గురిచేస్తే, కొన్ని స్పూర్తిని నింపుతాయి. నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి. స్పూర్తి నింపే కొటేషన్లను ఏరి చిన్న కాగితంపై రాసుకుని మీ వర్క్ స్టేషన్ దగ్గర అతికించుకోండి. మీకు ఉద్యోగం పట్ల అయిష్టత కలిగినప్పుడల్లా వాటిని చదువుకోండి. రంగురంగుల స్టికీ నోట్స్ బయట అమ్ముతున్నారు. వాటిని తెచ్చి రంగురంగుల కాగితాలపై కొటేషన్లు రాసుకోండి. ఆ రంగుల హరివిల్లు కూడా మీలో పాజిటివిటీని పెంచుతుంది.
వారిని దూరం పెట్టాలి
ఉద్యోగం పట్ల ద్వేషంతో ఉన్న మీలో, మీకు తెలియకుండానే నెగిటివిటీ చేరిపోయింది. అదే లేకపోతే మీకు ఉద్యోగం నచ్చకపోవడం, చేయాలనిపించకపోవడం వంటి ఉద్దేశాలు కలగవు. మీ చుట్టూ కూడా నెగిటివ్ వార్తలు మోసుకొచ్చేవాళ్లు, ప్రతికూల మాటలు చెప్పేవాళ్లుంటే సమస్యా ఇంకా పెరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్లని దూరం పెట్టాలి.
ఆటలు ఆడాల్సిందే
ఎలాంటి మార్పులేని దినచర్యలు, పని ఒత్తిళ్ల వల్ల జీవితంలో నిరాశ కమ్ముకుంటుంది. కాబట్టి జీవితం బోరింగ్ మార్చుకోకుండా కాస్త ఉత్సహం నింపుకుంటే మంచిది. మధ్యమధ్యలో సెలవులు పెడుతూ స్నేహితులతో ఎంజాయ్ చేయండి, కొత్త ప్రదేశాలకు వెళ్లండి. రోజూ ఓ గంటసేపైనా ఆటలు ఆడండి. సరదాగా ఆడే ఆటలు మీలో పాజిటివిటీని పెంచుతాయి. మానసిక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
మీ లక్ష్యం ఏంటి?
మీకు నచ్చని ఉద్యోగంలో ఇరుక్కుపోయామని ఫీలవుతున్నారా? ఇంట్లో ఖర్చుల కోసం మాత్రమే ఉద్యోగం చేస్తున్నారా? అయితే హఠాత్తుగా ఉద్యోగం మానేయడం వల్ల సమస్యలు పెరుగతాయి కానీ తగ్గవు. మీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోండి, దాన్ని చేరాలంటే పెట్టుబడి అవసరం అవుతుంది. ఆ పెట్టుబడి ఇచ్చేది ఈ ఉద్యోగమే అనుకోండి. మెల్లగా లక్ష్యాన్ని చేరేందుకు ఈ ఉద్యోగాన్నే మొదటి మెట్టుగా మలచుకోండి. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మీ లక్ష్యాన్ని లేదా నచ్చిన ఉద్యోగాన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండండి.
ఈ నాలుగు పనుగు చేస్తే మీరు చేసే ఉద్యోగం పట్ల ద్వేష భావం కలగదు.
Also read: ఆపిళ్లు ఎన్నయినా తినండి, వాటిలోని గింజలు ఎక్కువ తింటే మాత్రం నేరుగా ఐసీయూకే