Diabetes: డయాబెటిస్ ఉందా? మీ చూపు పోయే వరకు తెచ్చుకోవద్దు
డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు తీసేంత ప్రమాదకారిగా మారిపోతుంది.
ప్రపంచంలో ప్రతి ఆరుగురి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒకరు భారతీయులే... ఒక సర్వే తేల్చిన నిజం ఇది. డయాబెటిస్ ఉన్న వాళ్లు ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు కదా అని మీకు మీరే సర్దిచెప్పుకోవద్దు. వారి శరీరంలో కనిపించని ఆరోగ్యసమస్యలెన్నో ఉంటాయి. ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలు ముంచుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. అలాంటి సమస్యల్లో
‘డయాబెటిక్ రెటినోపతి’ ఒకటి. ఇది కంటిచూపుపైనే నేరుగా ప్రభావం చూపిస్తుంది. చూపును పోగొట్టే సమస్య ఇది.
ఎందుకొస్తుంది?
మన కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనే అనే తెర వల్లే మనం చూడగలుగుతున్నాం. రెటీనా చూసిన దృశ్యం తాలూకు సిగ్నల్స్ ను తన వెనుక ఉండే ఆప్టిక్ నరాల ద్వారా మెదడుకు చేరవేస్తుంది. ఈ రెటీనాకు క్యాపిల్లరీస్ అని పిలిచే చాలా సన్నని రక్తనాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవాళ్లలో చక్కెర అదుపులో లేకపోతే డయాబెటిక్ రెటినోపతి అనే పరిస్థితి కలుగుతుంది. రెటీనాకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను మోసుకెళ్లే రక్తనాళాలు చాలా బలహీనంగా మారి, చిన్నపాటి ఉబ్బులు వస్తాయి. ఉబ్బిన రక్తనాళాలు చిట్లిపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు పోషకాలు, ఆక్సిజన్ రెటీనాకు చేరవు. దీంతో రెటీనా కూడా ఉబ్బిపోతుంది. దీన్ని రెటినల్ ఎడిమా అంటారు. చూపు మందగించడం ప్రారంభమవుతుంది.
లక్షణాలేంటి?
డయాబెటిక్ రెటినోపతి సమస్యా వచ్చినా కూడా మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. మొదటగా చిన్న చిన్న అక్షరాలు కనిపించకపోవడం కలుగుతుంది. చూపు తగ్గుతుంది. కంటి ముందు నల్లటి చుక్కలు కనిపిస్తాయి. ఆ చుక్కలు తేలుతున్నట్టు, ఒకదానితో ఒకటి అల్లుకుపోతున్నట్టు కనిపిస్తాయి. రక్తనాళాల నుంచి రక్తస్రావం అవుతుంది.ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్త పడకపోతే కంటిచూపు అకస్మాత్తుగా పోతుంది. కనుగుడ్డు నుంచి రెటీనా విడిపోయి ‘రెటినాల్ డిటాచ్‌మెంట్’పరిస్థితి కలుగవచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్న వారు ఎప్పటికప్పుడు కళ్లు కూడా చూపించుకోవాలి. ముఖ్యంగా రెటీనాను పరీక్షించే వైద్యుడి వద్దకు వెళ్లాలి.
డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకుంటే పరిస్థితి చేయి దాటదు. మధుమేహం చేయిదాటకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, అలవాట్లతో జీవించాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: పీరియడ్స్‌లో పొట్ట నొప్పి ఎందుకొస్తుంది? వీటిని తింటే ఆ నొప్పి తగ్గే అవకాశం
Also read: మధుమేహుల సంఖ్య పెరుగుతోంది, తెల్ల అన్నాన్ని మాని దంపుడు బియ్యం తినాల్సిన సమయం ఇదే