Periods Pain: పీరియడ్స్‌లో పొట్ట నొప్పి ఎందుకొస్తుంది? వీటిని తింటే ఆ నొప్పి తగ్గే అవకాశం
కొందరి మహిళల్లో రుతుస్రావం మొదలైతే చాలు అదో నరకమే. భరించలేని పొట్టనొప్పితో విలవిలలాడిపోతారు.
నెలసరులు (Periods) అందరి మహిళల్లో ఒకేలా ఉండవు. కొందరిలో ఎలాంటి సమస్యా లేకుండా వచ్చి మూడు రోజులకు వెళ్లిపోతాయి. మరికొందరిలో మాత్రం ఆ మూడు రోజులు ఓ నరకం. విపరీతమైన పొత్తికడుపు నొప్పితో విలవిలలాడిపోతారు.కొందరికి నొప్పి తీవ్రత అధికంగా ఉంటే, మరికొందరికి స్వల్పంగా ఉంటుంది.
నొప్పి ఎందుకొస్తుంది?
బహిష్టు సమయంలో వచ్చే కడుపునొప్పిని ‘డిస్మెనోరియా’ అంటారు. ఇది మనిషి మనిషికి వేరువేరుగా కలుగుతుంది. రక్తస్రావానికి కొద్దిగంటల ముందు నుంచి మొదలై ఒకటి నుంచి మూడు రోజుల పాటూ సాగుతుంది.దీనికి కారణం గర్భాశయ లోపలి పొర. ఆ పొరను ఎండోమెట్రియమ్ అంటారు. అది నెలసరి సమయంలో విచ్ఛిన్నమై బయటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ F2ఆల్ఫా అనే పదార్థం విడుదలవుతుంది. దాంతో గర్భాశయంలో సంకోచ వ్యాకోచాలు అధికంగా కలుగుతాయి. గర్భశయం సంకోచించినప్పుడు రక్తసరఫరా తగ్గి, గర్భాశయ కండరాలకు ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. దీంతో కడుపునొప్పి వస్తుంది.
తగ్గించుకోవడం ఎలా?
అన్నింటికీ మందులు వాడడం అంత మంచిది కాదు. కాబట్టి కొన్నింటి వంటింటి చిట్కాలతోనే తగ్గించుకోవాలి. ఆ మూడు రోజులు కొన్ని రకాల ఆహారాలను తినడం ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు.
1. నీళ్లలో అల్లం ముక్క వేసి మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయ్యాక నిమ్మరసం పిండుకుని తాగాలి. నెలసరి సమయంలో రోజుకు రెండుసార్లు తాగితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
2. డార్క్ చాక్లెట్, అవకాడో పండ్లను ఆ మూడు రోజులు పాటూ తింటూ ఉండాలి.
3. చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, మెగ్నిషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చేపలను ఆ మూడు రోజుల పాటూ తిన్నా పొట్ట నొప్పి తగ్గుతుంది.
4. పాలకూరలో కూడా చాలా ఎన్నో సుగుణాలు ఉన్నాయి. పాలకూర వేపుడు, పప్పులో అధికంగా పాలకూర వండుకుని తిన్నా మంచిదే.
5. అరటిపండు, పైనాపిల్, కివీ పండ్లను నెలసరి నొప్పులు వస్తున్న సమయంలో తినాలి.
6. అన్నింటికన్నా ముఖ్యంగా నీరు పుష్కలంగా తాగాలి. నీరు తగ్గితే కడుపునొప్పి అధికమవుతుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: ఈ అలవాట్లు మీకున్నాయా? అయితే నెలాఖరుకు జేబు ఖాళీ అవడం ఖాయం
Also read: మధుమేహుల సంఖ్య పెరుగుతోంది, తెల్ల అన్నాన్ని మాని దంపుడు బియ్యం తినాల్సిన సమయం ఇదే