Brown Rice: మధుమేహుల సంఖ్య పెరుగుతోంది, తెల్ల అన్నాన్ని మాని దంపుడు బియ్యం తినాల్సిన సమయం ఇదే
కంటికి కనిపించని భయంకరమైన వ్యాధి మధుమేహం. మనకు తెలియకుండానే శరీరాన్ని రోగాలతో కుంగిపోయేలా చేస్తుంది.
ఓ అధికారిక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పది లక్షలకు పైనే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42 కోట్ల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ రుగ్మత వల్ల ఇతర అనేక రోగాలు కూడా తరచూ దాడిచేస్తాయి.మధుమేహం ఉన్నవారిలో గుండె పోటు, అంధత్వం, మూత్రపిండాలు విఫలం కావడం, స్ట్రోక్, ఇన్ఫెక్షన్ కారణంగా కాళ్లు, పాదాలు తీసేయాల్సి రావడం వంటి సమస్యలు దాడి చేసే అవకాశం ఎక్కువ. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చిందా... ఒంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎన్ని మందులు వాడినా పోదు. అందుకే రాకుండానే జాగ్రత్తపడాలి. అందుకోసం ముందుగా అందరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఇక ఆహారం విషయానికి వస్తే ముందు తెల్ల అన్నాన్ని తగ్గించాలి.
దంపుడు బియ్యం తినాల్సిందే..
తెల్ల అన్నంతో పోలిస్తే దంపుడు బియ్యం చాలా మంచివి. రుచి గురించి ఆలోచించకుండా నలభై ఏళ్లు దాటాక మధుమేహం వచ్చినా రాకపోయినా దంపుడు బియ్యం తినడం ప్రారంభించాలి. తెల్ల అన్నాన్ని తగ్గించడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే జంక్ ఫుడ్, కేకులు, మైదాతో చేసిన వంటకాలు, ఆయిల్ ఫుడ్స్ కూడా చాలా తగ్గించాలి. పండ్లు, తాజా కూరగయాలు, ఆకు కూరలు తినేందుకు ప్రాధాన్యతనివ్వాలి.
బ్రౌన్ రైసే ఎందుకు?
దంపుడు బియ్యం అంటే పాలిష్ పట్టనివి అని అర్థం. తెల్లన్నం అంటే పాలిష్ చేసిన బియ్యం. దంపుడు బియ్యంలో గింజలు పైన పొట్టుతో కలిసి ఉంటాయి. ఆ పొట్టులోనే పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ పాలిస్ చేసిన బియ్యంలో పొట్టు కాస్త కూడా ఉండదు. అందుకే తెల్ల అన్నంతో పోలిస్తే, దంపుడు బియ్యం చాలా ఆరోగ్యం.
దంపుడు బియ్యం వల్ల షుగర్ రాదు
బ్రౌన్ రైస్‌లో థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఈ బియ్యంలో ఉండే మెగ్నిషియం, పీచు పదార్థాలు రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉంచుతాయి. అందుకే తెల్ల అన్నం కన్నా బ్రౌన్ రైస్ తినేవారిలో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం 31 శాతం తక్కువ అని అధ్యయనాలు తేల్చాయి. అదే తెల్ల అన్నంతో మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువ. ఎందుకంటే తెల్ల అన్నం గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువ. జీఐ అధికంగా ఉండే ఆహారాలు మధుమేహం ఉన్న వారు, లేని వారు కూడా అధికంగా తినకూడదు.
గుండె జబ్బులు రావు
దంపుడు బియ్యం తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 16 నుంచి 21 శాతం తగ్గుతుంది. బ్రౌన్ రైస్ తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి గుండె సంబంధ వ్యాధులు తక్కువ వస్తాయి.