Diwali Glow Tips : దీపావళికి దియాలా అందంగా మెరిసిపోవాలా? ఈ 5 ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి
Natural Skincare Tips : ఆయుర్వేదంతో మీరు సహజమైన సౌందర్యాన్ని పొందవచ్చు. కేవలం 5 టిప్స్ రెగ్యులర్‌గా ఫాలో అయితే కచ్చితంగా మీ స్కిన్ మెరుస్తుంది. అవేంటో చూసేద్దాం.

Ayurvedic Beauty Rituals for Diwali : పండుగల సమయంలో అందరూ అందంగా తయారు అవుతారు. అలాగే చాలా ఆనందంగా ఉంటారు. అలా అందంగా ముస్తాబైనప్పుడు కచ్చితంగా ఫోటోలు దిగాలి. అదే దీపావళి అయితే కచ్చితంగా దీపాలతో ఫోటోలు దిగాల్సిందే... సోషల్ మీడియాలో పెట్టాల్సిందే. అలాంటప్పుడు మేకప్ వేసుకోవడం కాకుండా.. సహజంగా చర్మాన్ని గ్లో తెచ్చుకోవాలి. ఆరోగ్యకరమైన చర్మం, మంచి గ్లో కోసం ఆయుర్వేద చిట్కాలు ఫాలో అవ్వవచ్చు. వీటిని మీ స్కిన్ కేర్ రొటీన్లో ఫాలో అయితే.. మీ చర్మం చాలా అందంగా, హెల్తీగా మారుతుంది. మరి ఆయుర్వేద నిపుణులు హరి రామ్ రిన్వా ఇస్తోన్న స్కిన్ కేర్ టిప్స్ ఏంటో చూసేద్దాం.
సహజ పదార్ధాలతో..
చర్మం అందంగా కనిపించాలంటే.. ముందు దానిపై మలినాలు తొలగించాలి అంటోంది ఆయుర్వేదం. పండుగ సీజన్లో సహజ మెరుపు కావాలనుకునేవారికి ఇది చాలా ముఖ్యం. ఆ సమయంలో పసుపు, వేప, చందనం వంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన మృదువైన, సహజమైన క్లెన్సర్‌లను ఉపయోగించవచ్చు. పసుపు మెరుపునివ్వడానికి, వేప చర్మాన్ని డీటాక్స్ చేసే సహజమైన క్లెన్సర్‌గా, చందనం మంటను తగ్గిచడంలో హెల్ప్ చేస్తుంది. అనంతరం రోజ్ వాటర్, టోనర్ అప్లై చేస్తే తక్షణ తాజాదనాన్ని ఇస్తుంది. అనంతరం మాయిశ్చరైజర్, సీరమ్‌లు అప్లై చేస్తే మంచిది.
అభ్యంగ
అభ్యంగ లేదా ఆయుర్వేద నూనె మసాజ్.. రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. ఇది ముఖాన్ని డీ-పఫ్ చేసి.. చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది. ఇది చర్మాన్ని పునరుద్ధరించడానికి హెల్ప్ చేసి సహజంగా మెరుపు ఇస్తుంది. దీనికోసం నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ఆయిల్ తీసుకుని.. దానిని ముఖంపై వృత్తాకార కదలికలలో మసాజ్ చేయవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి లుక్ ఇస్తుంది. మీరు మసాజ్ చేసే నూనెలో కొన్ని చుక్కల చందనం లేదా కుంకుమపువ్వు ఆయిల్ కూడా వేసుకోవచ్చు.
ఇంటెన్సివ్ మాయిశ్చరైజింగ్
హైడ్రేషన్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పండుగల సీజన్లలో చర్మం ఈజీగా పొడిబారిపోతుంది. కాబట్టి ఎక్కువ హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇది చర్మాన్ని లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేస్తుంది. మృదువైన స్కిన్ అందిస్తుంది. అలాగే బయటనుంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలనుకుంటే అలోవెరా, లైకోరైస్, పసుపు వంటి ఆయుర్వేద లక్షణాలు కలిగిన మాయిశ్చరైజర్లు ఎంచుకోవాలి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.
సహజ సన్‌స్క్రీన్
ఎండ రోజుల్లోనే కాకుండా సంవత్సరం పొడవునా సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్ వాడాలి. ఆయుర్వేదంలో సహజ ఖనిజ ఆధారిత సన్‌స్క్రీన్లను సిఫార్సు చేస్తుంది. జింక్ ఆక్సైడ్ వంటి పదార్థాలను, పసుపు, కలబంద వంటి ఆయుర్వేద మూలికలను కలిగి ఉన్న సన్‌స్క్రీన్లను ఎంచుకోండి. ఇవి చర్మానికి సహజమైన రక్షణను అందించి కండిషన్ చేస్తాయి. తేలికైనవి, జిడ్డు లేనివి, సున్నితమైనవి ఎంచుకుంటే మంచిది. మేకప్ వేసుకునే ముందు స్కిన్ కేర్‌లో సన్‌స్క్రీన్ ఉపయోగించాల్సి ఉంటుంది.
బ్యూటీనిచ్చే ఫుడ్స్
ఆయుర్వేదం ప్రకారం.. చర్మం నిగారింపుతో కనిపించాలంటే.. చర్మానికి లోపలి నుంచి పోషణ అందాలి. కాబట్టి సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందించే పుడ్స్ తీసుకోవాలి. మీ డైట్లో దానిమ్మ, నారింజ, క్యారెట్లు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తులసి, అల్లం, పసుపు కలిగిన మూలికా టీలు మెరుగైన జీర్ణక్రియ, డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అశ్వగంధ, త్రిఫల వంటి ఆయుర్వేద మూలికలు ఒత్తిడిని తగ్గించి జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. ఇవి చర్మ నాణ్యతను పెంచుతాయి. వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటే స్కిన్‌కి మంచిది.
ఆయుర్వేద నిపుణులు సూచించే ఈ 5 టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా మీ స్కిన్ టోన్ మెరుగవుతుంది. అలాగే సహజమైన గ్లో వస్తుంది. అందరికీ వెంటనే రిజల్ట్స్ రాకపోవచ్చు కానీ.. రెగ్యులర్‌గా ఫాలో అయితే కచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందుతారు.






















