(Source: ECI/ABP News/ABP Majha)
Health Problems In Angry Persons: చీటికి మాటికి కోపంతో ఊగిపోతున్నారా? ప్రాణాలు పోవడం ఖాయం - ఎందుకంటే?
కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతారు. పళ్లు పటపటా కొరుకుతారు. అలాంటి వారికో షాకింగ్ న్యూస్. ఎప్పుడూ కోపంగా ఉండేవారు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
Angry Can Increase Risk Of Heart Attack: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షణ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనిషికి కోపం ఎంత ఎక్కువైతే అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన కోపం జీవితంలో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. లేనిపోని తలనొప్పులకు కారణం అవుతుంది. ఇంకా చెప్పాలంటే అదే కోపం కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉంటుంది. ఇదేదో కాకమ్మ కథకాదు. తాజా పరిశోధనలో వెల్లడైన పచ్చి నిజం. ఎప్పుడూ కోపంతో ఊగిపోయే వారికి గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని తేల్చి చెప్పింది. అంతేకాదు, కోపంలోనే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
కోపం ఎక్కువైతే గుండెపోటు వచ్చే అవకాశం!
కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, న్యూయార్క్ లోని సెయింట్ జాన్స్ యూనివర్శిటీ, మరికొన్ని ఇతర సంస్థలతో కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ స్టడీలో భాగంగా 280 మంది ఆరోగ్యవంతులను పరిశీలించారు. వారిని నాలుగు గ్రూఫులుగా విభజించారు. వారికి కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే సంఘటను గుర్తు చేశారు. ఒక్కో గ్రూపులోని వ్యక్తులను సుమారు 8 నిమిషాల పాటు ఈ పరిశోధన నిర్వహించారు. అనంతరం ఆయా గ్రూపు సభ్యుల బ్లడ్ శాంపిల్స్ తీసుకుని పరిశీలించారు. ఒక్కో గ్రూపు సభ్యుల రక్తంలో మార్పులను స్టడీ చేశారు. బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే గ్రూపులతో పోల్చితే, కోపానికి గురైన గ్రూపు సభ్యులలో గణనీయమైన మార్పులు కనిపించాయి. కోపిష్టి గ్రూపులోని వారి రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గినట్లు వారు కనుగొన్నారు. కొన్ని నిమిషాల పాటు కోపంగా ఉండటం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, తీవ్రమైన భావోద్వేగాలు గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
కోపంతో గుండె మరింత వీక్
కొద్ది నిమిషాల పాటు కోపాన్ని కొనసాగించడం వల్ల రక్తనాళాల పని తీరు మారిపోతున్నట్లు ఈ స్టడీలో తేలింది. తీవ్రమైన కోపం గుండెపోటుకు కారణం అవుతుందని తాజాగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడించింది. కోపం కారణంగా గుండె మరింత వీక్ గా తయారువుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగా గుండెపోటుతో పాటు ఇతర గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యం సరిగా లేని వారిలో తీవ్రమైన భావోద్వేగాలు మరిన్ని గుండె సమస్యలకు కారణం ఛాన్స్ ఉందని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు డైచీ షింబో తెలిపారు. "తరచుగా కోపం సహా తీవ్రమైన భావోద్వేగాలకు గురి కావడం వల్ల గుండె ప్రభావితం అవుతుంది. నెమ్మదిగా పరిస్థితి తీవ్రం అవుతుంది. ఒకానొక సమయంలో మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కోపం అనేది కొన్నిసార్లు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది” అని ఆయన తన పరిశోధన పత్రంలో వెల్లడించారు.
Read Also: చేపలకూ ఉంది ఒక దినం, అదే ‘వరల్డ్ టూనా డే’ - ఎందుకు జరుపుతారంటే?