Beer For Health: పొట్ట ఆరోగ్యానికి బీరు మంచిదేనంట, చెబుతున్న కొత్త అధ్యయనం
బీరు తాగేవారి ఇది చదివితే ఇక రెచ్చిపోతారేమో, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి.
బీర్ పై ఇప్పటికే భిన్నాభిప్రాయలు ఉన్నాయి. కొంతమంది బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదే అంటుంటే, మరికొందరు దాని వల్ల ఊబకాయం వస్తుందని, అలాగే ఆల్కహాల్ కు బానిసయ్యే అవకాశాలు ఎక్కువని వాదిస్తుంటారు. నిజానికి బీర్ బాటిల్ తో మొదలెట్టి తాగుబోతుగా మారిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అందుకే బీర్‌ను చూసి భయపడేవాళ్లు ఎక్కువ. అయితే కొత్త అధ్యయనం మాత్రం బీర్ తాగడం వల్ల పొట్ట ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెబుతోంది. పోర్చుగీస్ యూనివర్సిటీలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయాన్ని తేల్చారు అధ్యయనకర్తలు. ప్రతిరోజు ఒక బీర్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.ముఖ్యంగా మగవారు రాత్రి భోజనంతో పాటూ బీర్ తాగడం వల్ల వారి పొట్టలో మంచి బ్యాక్టిరియా స్థాయి పెరుగుతుందని వివరిస్తున్నారు. ఆల్కహాలిక్ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్ రెండింటి నుంచి ఈ రకం ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
అధ్యయనం ఇలా...
19 మందిపై అధ్యయనం సాగింది. వారి సగటు వయసు 35. నాలుగు వారాల పాటూ వారికి రాత్రి భోజనంలో బీర్ తాగమని చెప్పారు పరిశోధకులు. కొందరికి ఆల్కహాలిక్ బీర్, మరికొందరికి నాన్ ఆల్కహాలిక్ బీర్ ఇచ్చారు. ఆల్కహాలిక్ బీర్ లో ఆల్కహాల్ శాతం కేవలం 5.2 శాతం మాత్రమే ఉండేట్టు చూసుకున్నారు. నాలుగు వారాల తరువాత వారి రక్త శాంపిల్స్, మల మూత్ర శాంపిల్స్ ను సేకరించారు. వాటిని పరీక్షించి ఒక నిర్ధారణకు వచ్చారు.
ఈ పరిశోధనా వివరాలు జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. బీర్ తాగడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టిరియా సంఖ్య పెరుగుతుందని తేలింది. బీర్ వల్ల వచ్చే బ్యాక్టిరియా చాలా వైవిధ్యమైనదని చెప్పారు. ఇవి మొత్తం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అంతేకాదు రోజూ బీర్ తాగడం వల్ల బరువు పెరగరని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రక్తం, గుండె, జీవక్రియలకు సంబంధించి ఎలాంటి సమస్యా ఉండదని కూడా తేల్చి చెప్పారు.
మంచి బ్యాక్టిరియా ఎలా పెరుగుతుంది?
బీర్‌లో పాలీఫెనాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. కుళ్లిన ప్రక్రియలో ఇలాంటి సూక్ష్మజీవులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బీర్ ను తయారుచేసే ప్రక్రియలో ఇలాంటి సూక్ష్మజీవులు పుడతాయి. వాటివల్ల మంచి బ్యాక్టిరియా పెరుగుతుంది. వీటి వల్ల గుండె వైఫల్యం, మధుమేహం వంటి రోగాలు రావు.
మితంగా తాగితేనే....
రోజుకో బీర్ కు మించి తాగితే మాత్రం అనర్థాలు తప్పవు. బీర్ మంచిదని చెప్పారు కాబట్టి రోజుకు రెండు మూడు సీసాలు తాగేద్దామని అనుకుంటున్నారేమో, అప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తాయి.
Also read: పన్నెండు కిలోల ఆ బంగారు నాణెం ఎక్కడుంది? ఎందుకు మనదేశం దాని కోసం వెతుకుతోంది?
Also read: కాఫీ కాని కాఫీ, కాఫీ గింజలతో తయారు కాదు కానీ ఇది కూడా కాఫీయే