Coffee: కాఫీ కాని కాఫీ, కాఫీ గింజలతో తయారు కాదు కానీ ఇది కూడా కాఫీయే
కాఫీ గింజలతో అవసరం లేకుండా తయారు చేసిన కాఫీ ఇది.
ప్రతి ఉత్పత్తికి ప్రత్నామ్నాయం పుట్టుకొస్తుంది. వీగన్ల కోసం మాంసం కాని మాంసాన్ని తయారుచేశారు. కేవలం మొక్కల ఆధారిత పదార్థాలతోనే ఆ మాంసాన్ని రెడీ చేశారు. ఇప్పుడు కాఫీ లాంటి కాఫీని తయారుచేశారు. రుచి నిజమైన కాఫీలాగే అదిరిపోతుంది. కానీ కాఫీ గింజలతో తయారుకాదు. కప్పు కాఫీ తాగితే స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కాఫీ ప్రియుల కోసమే వచ్చిన కొత్త రకం పానీయం ఇది.
ఏంటిది?
ప్రపంచంలో కాఫీ డిమాండ్ పెరిగిపోతోంది. రోజురోజుకి వినియోగం పెరిగిపోతోంది. ఉత్పత్తి కన్నా వినియోగం ఎక్కువుంది. అతిగా కాఫీ మొక్కలు పెంచాల్సి వస్తుంది. కేవలం కాఫీ మొక్కల సంఖ్య మాత్రమే పెరిగితే జీవ సమతుల్యతలో తేడా రావచ్చు.ఇది భవిష్యత్తులో భూమి ఉనికికే ప్రమాదం కావచ్చు. అందుకు ఈ కాఫీ గింజలే అవసరం లేని కాఫీని తయారుచేసింది ఓ సంస్థ. దీని పేరు మాలిక్యులర్ కాఫీ. దీన్ని పొద్దు తిరుగుడు గింజల మీద ఉండే పొట్టు, పుచ్చకాయ గింజలతో తయారు చేస్తారు. వీటిని రకరకాల రసాయన ప్రక్రియలకు లోను చేసి కాఫీ పొడిగా మారుస్తారు. అంతేకాదు ఈ కాఫీలో కెఫీన్ కూడా తక్కువగా ఉంటుంది. కాఫీ ప్రియులకు అదొక వరమనే చెప్పాలి.
ఎందుకు తయారుచేశారు...
ఈ కాఫీని తయారుచేసిన కంపెనీ ప్రకారం దీనిని తయారుచేయడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది కాఫీ గింజల్లో ఉండే చేదును ఇష్టపడని వారికోసం ఈ కాఫీ. ఇక రెండోది కెలోరీల సంఖ్య తక్కువగా ఉండడం. కాఫీ గింజలతో చేసిన దాని కన్నా దీనిలో కేలరీలు తక్కువుంటాయన్నమాట. ఇక చివరి కారణం సస్టైనబిలిటీ. ఇది వాతావరణ మార్పులకు ఏమాత్రం ప్రభావితం కానీ ప్రత్యామ్నాయం. అంటే వాతావరణ మార్పులకు లోనై కాఫీ గింజల ఉత్పత్తి తగ్గిపోయినా ఈ కాఫీతో నెట్టుకొచ్చేయచ్చన్న మాట.
ఈ కాఫీ ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాల్లో పరిచయం అయింది. మనదేశానికి ఏదోరోజు అడుగుపెడుతుంది. దీన్ని తయారుచేసింది అమెరికాకు చెందిన అటోమో కాఫీ అనే సంస్థ. అక్కడి వారికి ఇది నచ్చేసింది. అక్కడ అమ్మకాలు పెరిగితే పక్క దేశాలకు పరిచయం చేయడం మొదలవుతుంది. పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి మంచివే కాబట్టి ఈ కాఫీ తాగడం వల్ల అంతా మంచే జరుగుతుంది.
Also read: మనిషి మాంసం రుచి తెలియాలంటే ఈ బర్గర్ తినాలి, పూర్తిగా తినగలిగితే అవార్డు కూడా
Also read: పనస తొనలు తినేసి పిక్కలు పడేస్తున్నారా? వాటిని ఇలా తింటే ఎన్ని లాభాలో