Ayurvedam: చెవి పోటు తరచూ వచ్చి ఇబ్బంది పెడుతోందా? ఇలా ఇంటి చిట్కాలతో తగ్గించుకోండి
చెవిపోటు తగ్గించే మార్గాలను ఆయుర్వేదం చెబుతోంది.
చెవి పోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చల్లగాలి చెవిలోకి చొరబడినా, సైనసైటిస్ వంటి సమస్యతో బాధపడుతున్నా, పంటి నొప్పి వేధిస్తున్నా కూడా చెవిపోటు మొదలైపోతుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. ఇలా చెవి పోటుతో బాధపడుతున్న వారు వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదంలో కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చెవిపోటు తగ్గే అవకాశం ఉంది.
తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఎక్కువ. చెవిపోటు వస్తున్నప్పుడు తులసి ఆకుల నుంచి రసాన్ని తీసి చెవిలో వేయాలి. ఇలా వేయడం వల్ల చెవిపోటు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఇంట్లో లవంగాలు ఉంటాయి. అలాగే లవంగా నూనెను కూడా ఇంట్లో ఉంచుకోవడం చాలా అవసరం. లవంగ నూనెను చెవిలో వేస్తే నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇంట్లో లవంగ నూనె అందుబాటులో లేకపోతే కాస్త నువ్వుల నూనెలో లవంగాలను వేసి మరిగించండి. ఆ నూనెను చల్లార్చి వడకట్టి రెండు చుక్కలు చెవిలో వేయండి. ఇది చెవిపోటును తగ్గించడానికి సహకరిస్తుంది. నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనె కూడా చెవిపోటుపై ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నది ఆయుర్వేదం. వీటిని వేడి చేసి చల్లార్చి చెవిలో రెండు చుక్కలు పోస్తే మంచి ఫలితం ఉంటుంది.
చెవి పోటు ఉన్నప్పుడు చెవి బయట ప్రాంతంలో కూడా వాపు లాంటిది కనిపించే అవకాశం ఉంది. అలాంటప్పుడు వెల్లుల్లిని మెత్తగా దంచి చిన్న వస్త్రంలో చుట్టి చెవినొప్పి వస్తున్న ప్రాంతంలోని బయట వైపు ఒత్తుతూ ఉండాలి. అలాగే అల్లాన్ని కూడా తెంచి రసం తీసి ఆ ప్రాంతంలో మెల్లగా మర్దన చేయాలి. ప్రతి ఇంట్లో యూకలిప్టస్ నూనె ఉంచుకోవడం చాలా అవసరం. ఇది ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. వేడినీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి దానిని ఆవిరి పడితే ఎంతో మంచిది. సైనస్ వల్ల చెవిపోటు వచ్చి ఉంటే ఇలా యూకలిప్టస్ నూనెతో చేయడం వల్ల చెవిపోటు తగ్గే అవకాశం ఉంది. యూకలిప్టస్ నూనె అంటే నీలగిరి తైలం.
నీలగిరి చెట్టు ఆకులను నలిపి వాసన చూస్తే జండూబామ్ లా వాసన వస్తుంది. జండూబామ్ తయారీలో నీలగిరి తైలాన్ని వాడతారు. అందుకే ఇది జలుబు, చెవి పోటుపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తలనొప్పి వేధిస్తున్నప్పుడు నీలగిరి తైలాన్ని రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జలుబు, గొంతునొప్పి వేధిస్తున్నప్పుడు ఈ నూనెను వాసన చూస్తూ ఉంటే తగ్గే అవకాశం ఎక్కువ. నడుము నొప్పితో బాధపడేవారికి కూడా ఈ నూనె ఎంతో మేలు చేస్తుంది. దీన్ని నడుముకు పట్టించడం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఒళ్లు నొప్పులుగా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల తైలాన్ని వేసి స్నానం చేయాలి. అలా చేస్తే ఒళ్లునొప్పులు తగ్గే అవకాశం ఎక్కువ.
Also read: పిల్లల్లో వచ్చే టైప్1 డయాబెటిస్ గురించి ఈ విషయాలు తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.