Money: డబ్బుతో ఆనందాన్ని కొనలేం అన్నది పచ్చి అబద్ధం అంటున్న అధ్యయనం
డబ్బుతో నిజమైన ఆనందాన్ని కొనలేమని చెబుతూ ఉంటారు ఎంతోమంది. కానీ కొనగలం అని చెబుతోంది అధ్యాయం.
ఆనందం అంటే డబ్బుతో కొనేది కాదని, అది చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం ద్వారా వస్తుందని వింటూనే ఉంటాం. సంపదను పోగు చేయడం ద్వారా సంతోషాన్ని కొనలేరు అంటూ ఎంతోమంది హితబోధ కూడా చేస్తుంటారు. ఎన్నో సినిమాల్లో, వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో తరచూ వినిపిస్తూనే ఉంది. కానీ ఓ అధ్యయనం మాత్రం అది పచ్చి అబద్ధమని, డబ్బుతో ఆనందాన్ని కొనగలమని చెబుతోంది. ఈ అధ్యయనంలో నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఒక ఆర్థిక వేత్త భాగస్వామిగా ఉన్నారు.
అమెరికాలోని చాలామంది డబ్బుతోనే ఆనందాన్ని పొందుతున్నట్టు ఈ అధ్యయనం నిరూపించింది. ప్రిన్స్‌టెన్ విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఆనందం కూడా పెరుగుతూ వస్తోందని ఈ పరిశోధనలో వారు తేల్చారు.
2010లో తొలిసారిగా డబ్బు ఆనందాన్ని పెంచుతుందా లేదా అన్న అంశంపై అధ్యయనం నిర్వహించారు. అప్పట్లో అమెరికాలోని ఒక సాధారణ పౌరుడి ఆదాయం సుమారు 75 వేల డాలర్లు వరకు చేరుకొని, అక్కడ స్థిరంగా ఉంటుందని సర్వేల్లో తేల్చారు. అయితే ఎవరి ఆదాయం అయితే 75 వేల డాలర్లు దాటిందో వారు ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారని ఈ అధ్యయనం అప్పట్లోనే చెప్పింది. అప్పట్లో 1000 మంది వ్యక్తుల నుండి డేటాను సేకరించి ఈ పరిశోధనను పూర్తి చేశారు. డేనియల్ కాన్హమాన్, మాథ్యూ కిల్లింగ్‌వర్త్స్ అనే ఇద్దరు ప్రపంచ స్థాయి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారి అధ్యయనం వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురించారు.
తాజాగా మళ్లీ అలాంటి అధ్యయనాన్నే నిర్వహించారు. 33,000 మంది అమెరికన్లను ఇంటర్వ్యూ చేశారు. అమెరికన్లలో తక్కువ జీతం ఏడాదికి పదివేల డాలర్ల నుండి ప్రారంభమవుతుంది. వారు ఎంత ఆనందంగా ఉన్నారు? షాపింగ్ చేసేటప్పుడు, రెస్టారెంట్లో తినేటప్పుడు... ఇలా వేరు వేరు సందర్భాల్లో వారి మానసిక స్థితులు ఎలా ఉన్నాయి? అనేది పరిశీలించారు. అలాగే ఏడాదికి ఐదు లక్షల డాలర్ల వరకు జీతం పొందే వ్యక్తుల జీవన శైలిని, వారి మానసిక పరిస్థితులను పరిశీలించారు. ఎవరికైతే ఎక్కువ ఆదాయం వస్తుందో, వారు ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి ఆదాయం, ఆనందానికి మధ్య గట్టి బంధం ఉందని ఈ పరిశోధన తేల్చింది. ఆర్థికంగా బాగా ఉన్నవారు సంతోషంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే అన్నివేళలా ఈ పరిశోధన నిజం కాకపోవచ్చు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, కుటుంబ బంధాలు బాంధవ్యాలు బలంగా ఉన్నవారికి ఆదాయం పెరిగితే వారిలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. కానీ అనారోగ్యంతో ఉన్నవారిలో మాత్రం ఆదాయం ఆనందాన్ని పెంచలేక పోతుంది.
Also read: ఒత్తిడిగా, ఆందోళనగా ఉంటే నాలుగు నారింజ తొనలు నోట్లో వేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.