UPSC CSE 2025 Application: సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారా? - యూపీఎస్సీ తెచ్చిన కొత్త నిబంధన గురించి తెలుసా?
UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే సమయంలో అవసరమైన ధ్రువపత్రాల సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది.

Changes in UPSC Notification 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసకుంటున్న అభ్యర్థులకు యూపీఎస్సీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్లు సమర్పించడాన్ని ఈ మేరకు కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ప్రకటించిన కొత్త నియమావళిలో ఈ విషయాన్ని పేర్కొంది. గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తరువాత మాత్రమే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్ తదితన ధ్రువపత్రాలు సమర్పించేవారు. అయితే మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్ తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి, దివ్యాంగుల కోటాలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అర్హులు.
దరఖాస్తు ఇలా..
✦ జనవరి 22న ‘సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025’ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
✦ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ పుట్టినతేదీ, కులం లేదా కమ్యూనిటీ (ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్‌లను పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను కచ్చితంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
పోస్టుల వివరాలు ఇలా..
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్ విభాగాల్లో మొత్తం 979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మే 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. మొత్తం ఖాళీల్లో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుకు అవకాశం..
సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 22న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (బెంచ్ మార్క్ డిజబిలిటీస్), మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
✦ ప్రిలిమ్స్ పరీక్ష విధానం:
మొత్తం 400 మార్కులకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.02.2025. (6 PM)
➥ ప్రిలిమ్స్ పరీక్ష తేది: 25.05.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

