Telangana Group 2 Cancel: 2015 తెలంగాణ గ్రూప్ 2 రద్దు చేసిన హైకోర్టు.. రీవాల్యుయేషన్‌కు 8 వారాలు గడువు
TGPSC Group 2 final selection list | ఓఎంఆర్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని గుర్తించిన హైకోర్టు 2015 గ్రూప్ 2 ఫైనల్ సెలక్షన్ లిస్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

హైదరాబాద్: తెలంగాణలో 2015లో విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్ 2 పోస్టులకు ఎంపిక తుది జాబితాను తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు రద్దు చేసింది. 2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ (OMR) షీట్లు టాంపరింగ్‌కు గురయ్యాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించడంతో, ఈ నోటిఫికేషన్ కింద నిర్వహించిన సెలక్షన్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు సరికాదని కోర్టు పేర్కొంది.
ఈ తీర్పు సందర్భంగా ధర్మాసనం టీజీపీఎస్సీ (TGPSC)పై కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల, ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించడానికి, ఓఎంఆర్ షీట్లను రీవాల్యుయేషన్ చేసి, 8 వారాలలోగా మళ్లీ తుది ఎంపిక జాబితాను ఇవ్వాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. 2019 అక్టోబరు 24న ఇచ్చిన ఫలితాలు చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేసింది. వైట్‌నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్, దిద్దుబాట్లు చేసిన ఓఎంఆర్ లను వాల్యుయేషన్ చేసిన కారణంగా నియామకాలు రద్దు చేయాలని దాఖలైన 6 పిటిషన్లపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టిన అనంతరం గ్రూప్ 2 సెలక్షన్ లిస్ట్ రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చారు. ఈ ఆదేశాలతో ఆ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉద్యోగార్థుల విషయంలో అనిశ్చితి నెలకొంది. అభ్యంతరాలు వ్యక్తం చేసిన అభ్యర్థులకు న్యాయం జరగనుంది.
హైకోర్టులో పిటిషనర్‌ల వాదనలు ఇవే
2015లో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-2 కింద మొత్తం 13 కేటగిరీలలో 1,032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, 2016లో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చారు.ఈ పోస్టుల భర్తీకి సంబంధించి 2016 నవంబరు 11, 13 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. అనంతరం ప్రశ్నపత్రం బుక్‌లెట్‌కు, ఓఎంఆర్ షీట్లకు మధ్య నంబర్ల పొంతన కుదరడం లేదని ఈ సమస్య పరిష్కారానికి 2016 డిసెంబరులో టీజీపీఎస్సీ ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమస్యను అధ్యయనం చేసి 2017 మార్చిలో తన నివేదికను సమర్పించింది. ప్రశ్నపత్రంలోని బుక్‌లెట్ నంబరు, ఓఎంఆర్ నంబరు ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని పేర్కొంది. ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్-ఎ (అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు) సంబంధించిన చిన్నచిన్న పొరపాట్లు ఉంటే వాటిని మన్నించాలని సిఫార్సు చేయగా, పార్ట్-బి లో ఏదైనా దిద్దుబాటు లేదా వైట్‌నర్ వాడినట్లయితే, వాటిని మూల్యాంకనం చేయరాదని కమిటీ స్పష్టం చేసింది.
కొందరు అభ్యర్థులు ఈ వివాదంపై హైకోర్టును ఆశ్రయించగా, మొదట సింగిల్ జడ్జి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్ సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ, వాటి ప్రకారమే మూల్యాంకనం చేపట్టాలని 2019 జూన్ 6న తుది తీర్పు వచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఓఎంఆర్ షీట్లలో అవకతవకలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను కూడా మూల్యాంకనం చేయడం ద్వారా తప్పిదం పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. దాంతో 2015 గ్రూప్-2 ఉద్యోగాలకు తుది జాబితా రద్దుకు కారణమైంది.






















