PCOS అంటే ఏమిటీ? హార్మోన్లు సమతుల్యత కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి?
మహిళలు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో పీసీఓఎస్ ఒకటి. దీని వల్ల గర్భం దాల్చడం చాలా కష్టం అవుతుంది.
ప్రతి పది మంది మహిళల్లో నలుగురు అనుభవించే సాధారణ ఆరోగ్య పరిస్థితి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(PCOS). ఇది ఓ దీర్ఘకాలిక సమస్య. దీని వల్ల హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. రుతుక్రమం సరిగా రాకపోవడం వల్ల గర్భం దాల్చడం కష్టం అవుతుంది. అందాలు విడుదల అవడం తగ్గిపోతుంది. ఒకవేళ గర్భం ధరించినా అది ఎంతో కాలం నిలవదు. ఈ సమస్యని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి శాశ్వతంగా పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పీసీఓఎస్ ప్రభావాన్ని తగ్గించడానికి ఆహారం సహాయపడుతుంది పరిశోధనలో తేలింది. ఈ సమస్య ఉన్న రోగుల్లో ఇన్సులిన్ నిరోధకత తరచుగా సంభవిస్తుంది.
పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళులో 50 శాతం మందికి మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ వచ్చే అవకశాలు ఎక్కువగా ఉంటున్నాయి. టెస్టోస్టెరాన్, డైహైడ్రోటెస్టోస్టెరాన్, మొటిమలు, జుట్టు రాలడం, హిర్సుటిజం, క్రమరహిత పీరియడ్స్ ఈ సమస్య లక్షణాలు. ఈ సమస్య ఉన్న వాళ్ళు మందులతోనే కాదు ఆహారంతో కూడా దాని నుంచి బయట పడొచ్చు. ఆరోగ్యరకరమైన బరువు, ఇన్సులిన్ స్థాయిలని పెంచుకోవడానికి పోషకాహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. ఈ ఆహార పదార్థాలని డైట్ లో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
గుమ్మడి కాయ: టెస్టోస్టెరాన్‌ను DHTగా మార్చడాన్ని నిరోధించే ఎంజైమ్‌ను కలిగి ఉంటుంది. ఇది మొటిమలు, జుట్టు రాలడం సమస్యల్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. హార్మోన్ల పనితీరుని నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలని కలిగి ఉంటుంది.
పుదీనా టీ: ప్రతిరోజు 2 కప్పుల స్పియర్మింట్ టీ తాగడం వల్ల టెస్టోస్టెరాన్ వంటి ఆండ్రోజెన్ లని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని మరిన్ని ప్రయోజనాలు పొందటం కోసం వేడి లేదా ఐస్ వేసుకుని తాగొచ్చు.
అవిసె గింజలు: హిర్సుటిజం, మొటిమలు సమస్యల్ని తగ్గించేందుకు ఇవి దోహదపడతాయి. వీటినో స్మూతిస్, సలాడ్ పైన చల్లుకుని తినొచ్చు. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలని తగ్గిస్తాయి.
సాల్మన్: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నందున టెస్టోస్టెరాన్, వాపు, కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకతని మెరుగుపరచడానికి దోహదపడతాయి.
వాల్ నట్స్: సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ ని పెంచుతుంది. ఇది టెస్టోస్టెరాన్ తగ్గించేందుకు సహాయపడుతుంది. వీటిని నానబెట్టుకుని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
సార్డినెస్: ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి కూడా టెస్టోస్టెరాన్ ని తగ్గియించి పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా మెరుగుపరుస్తాయి.
బాదంపప్పు: మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆండ్రోజెన్ ఇండెక్స్, టెస్టోస్టెరాన్ స్థాయిలని తగ్గించగలవు. మొటిమలు, మొహం మీద వెంట్రుకలు తగ్గిస్తాయి. ఆండ్రోజెన్ అనేది మగ హార్మోన్. దీని స్థాయిలు పెరగడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: చలికాలంలో చెవులు మూసుకుపోయాయా? ఈ చిట్కాలతో ఉపశమనం పొందొచ్చు