Male Fertility: మగవారూ జాగ్రత్త, లేటు వయసులో పిల్లల్ని కంటున్నారా? ఆ సమస్యలు పెరిగిపోతాయి
మగవారు తాము ఏ వయసులోనైనా బిడ్డకు జన్మనివ్వగలమని అనుకుంటారు, అది అపోహ మాత్రమే.
సంతానోత్పత్తి విషయానికి వస్తే ఆడవారి విషయంలో ఒకరకమైన నమ్మకాలు ఉంటే, మగవారి విషయంలో మరో రకమైన నమ్మకాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా పిల్లలు పుట్టక పోవడానికి ఆడవారే కారణమని భావిస్తారు. అయితే పురుషుల్లో ఉండే సమస్యలు వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది.పిల్లలు పుట్టకపోతే ఆ లోపం భార్యది అనుకోకుండా, తమలో ఏమైనా లోపం ఉందేమో చెక్ చేయించుకోవడం ఉత్తమం. తండ్రి కావాలనుకునే వాళ్ళు 30 ఏళ్లలోపే బిడ్డల కోసం ప్రయత్నించాలి. ముప్పయ్యేళ్లు దాటితే వారి వీర్యకణాల్లో నాణ్యత, సంఖ్య కూడా తగ్గిపోతుంది. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు పిల్లల్ని కనడానికి మగవారికి ఉత్తమ వయస్సు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఏ మగవారైతే నలభై ఏళ్లు దాటి పిల్లలకు ప్రయత్నిస్తారో, వాళ్లలో సంతానం లేమి సమస్యలు పెరుగుతాయి. పర్యావరణ మార్పుల వల్ల వీర్యకణాల్లో జన్యు ఉత్పరివర్తనలు జరుగుతాయి. వాటిలోని డిఎన్ఏ దెబ్బతింటుంది అని వివరిస్తున్నారు నిపుణులు. ఇది భవిష్యత్తులో పుట్టే పిల్లల్లో కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 40 ఏళ్లు దాటిన తండ్రులకు పుట్టిన పిల్లల్లో నాడీ సంబంధిత సమస్యలు, మానసిక సమస్యలు, ఆటిజం వంటి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తండ్రి వయస్సు కూడా పుట్టే పిల్లల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఎన్నో పరిశోధనలు చెప్పాయి.
లైంగికాసక్తి తగ్గి...
వయసు పెరగడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి, లిబిడో తగ్గిపోతుంది. దీనివల్ల అంగస్తంభన లోపం, స్ఖలన సమస్యలు వస్తాయి. వారి లైంగిక పనితీరు మందకొడిగా మారుతుంది. ఇవన్నీ సంతానోత్పత్తి పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇలాంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా ఉండాలంటే మగవారు నాలుగు పనులు తప్పకుండా చేయాలి.
ధూమపానం
ధూమపానం చేయనివారి కంటే, ధూమపానం అధికంగా చేసే పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను ఉంటుంది. ధూమపానం వీర్యంలోని డిఎన్ఏను కూడా దెబ్బతీస్తుంది. ఇది పిల్లలు పుట్టకపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి ధూమపానాన్ని, అన్ని రకాల పొగాకు ఉత్పత్తులని దూరంగా పెట్టాలి.
ఊబకాయం
అధిక బరువు, ఊబకాయం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయి. దీనివల్ల బిడ్డను కనడం కష్టమవుతుంది. బరువు తక్కువగా ఉంటే వీర్య నాణ్యత మెరుగుపడుతుంది.
మద్యం
మద్యం తాగే మగవారిలో కూడా స్పెర్మ్ కౌంటు నాణ్యత తగ్గుతుంది. అతిగా తాగడం వల్ల వారికి బిడ్డలు పుట్టే అవకాశం మందగిస్తుంది. కాబట్టి పిల్లలు కావాలనుకునే వాళ్ళు మద్యాన్ని తాగడం మానేయాలి.
అసురక్షిత సెక్స్
అసురక్షిత సెక్స్ వల్ల కూడా స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. వాటి వల్ల లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సుఖవ్యాధులు ఏమైనా ఉన్నా కానీ, చికిత్స తీసుకున్నాకే పిల్లల కోసం ప్రయత్నించాలి.
Also read: డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు నాలుగు సులువైన మార్గాలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.