'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రావణుడు మిస్సింగ్ - సైఫ్ అలీఖాన్ అందుకే రాలేదా?
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైఫ్ అలీఖాన్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సినిమాలో అతని పాత్రను తగ్గించేందుకు చేస్తోన్న ప్లాన్ అని టాక్
Saif Ali Khan : భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన 'ఆది పురుష్ (Aadi Purush)' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిన జీయర్ స్వామి(China Jeeyar Swamy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లంకేష్ పాత్రను పోషించిన సైఫ్ అలీఖాన్ మినహా సినిమాలోని నటీనటులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అత్యంత కీలక పాత్ర అయిన రావణ పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ వేడుకకు హాజరు కాకపోవడం పలు ఊహాగానాలకు దారితీసింది. దీనిపై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.
సైఫ్ అలీఖాన్ గైర్హాజరీకి కారణంపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆది పురుష్ సినిమాలో లంకేష్ పాత్రను తగ్గించడానికి చిత్ర బృందం వ్యూహాత్మక ఎత్తుగడలో ఇదొక భాగమని టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు ఆ పాత్రపై చర్చనీయాంశమైన వివాదాలు, విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ సమయంలో లంకేష్ ప్రమోషన్‌ను పరిమితం చేయడానికి టీమ్ ఎంచుకుని ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌ను దూరంగా ఉంచడం ద్వారా ఆ పాత్రపై వివాదాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అనుకుంటున్నారు.
అయితే, సైఫ్ అలీ ఖాన్ గైర్హాజరుపై అభిమానులు, ఔత్సాహికులు నిరాశను వ్యక్తం చేశారు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన ఆయన.. ఈ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడానికి కారణాలేంటా అని పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర (Devara) మూవీలో కూడా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తప్పకుండా ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని తెలుగు ప్రేక్షకులను ఫిదా చేస్తారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. అయితే, ఆ షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయారని తెలుస్తోంది. త్వరలో ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ‘ఆదిపురుష్’ మూవీ ప్రమోషన్స్ జరగనున్నాయి. సైఫ్ అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో ఉప్పెనలా కదంతొక్కిన రామసేన, రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం
ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆది పురుష్'.. భారతీయ పురాణాల నుంచి పుట్టుకొచ్చిన ఓ కథకు ప్రాణం పోస్తూ, ఒక పురాణ సినిమాటిక్ అనుభూతిని కలిగించనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించగా , జానకిగా కృతి సనన్ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ఆది పురుష్' సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, అభిమానులు తమ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ప్రదర్శన కోసం థియేటర్లలోకి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.