Takkar OTT Release: ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న ‘టక్కర్‘, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?
సిద్దార్థ్ హీరోగా కార్తీక్ జి క్రిష్ తెరకెక్కిన తాజా చిత్రం ‘టక్కర్‘. జూన్ 9న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
తెలుగులో 'బొమ్మరిల్లు', ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్దార్థ్. ఆయన నటించిన రీసెంట్ మూవీ 'టక్కర్'. కార్తీక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్జే విఘ్నేష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు. ప్యాషన్ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించారు. పలు మార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా, ఎట్టకేలకు జూన్ 9న థియేటర్లలో విడుదల అయ్యింది. తమిళం, తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినీ అభిమానులను అలరించడంలో ఈ మూవీ విఫలం అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది.
జులై 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘టక్కర్‘ స్ట్రీమింగ్
తాజాగా 'టక్కర్' సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్, డిజిటల్ ప్రీమియర్ తేదీని ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళంలో జూలై 7 2023 నుంచి ‘టక్కర్‘ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది.
వరుస ఫ్లాపులతో సిద్దార్థ్ సతమతం
ఒకప్పుడు తెలుగులో మంచి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేశాడు హీరో సిద్థార్థ్. అయితే, ఆ తర్వాత క్రమంగా వరుస ఫ్లాపులతో తన స్టార్ డమ్ పడిపోయింది. 2021లో ‘మహాసముద్రం’తో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకు కావాల్సిన సక్సెస్ దొరకలేదు. గత కొన్నాళ్లుగా సిద్దార్థ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. రీసెంట్ గా ‘టక్కర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైనా, రెండు చోట్లా డిజాస్టర్ గానే మిగిలింది. దీంతో ఆయన కెరీర్ ప్రశ్నార్థంకంలో పడింది. ప్రస్తుతం సిద్దార్థ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమాలో ఆయన నటిస్తున్నాడు. ఈ చిత్రం సక్సెస్ అయితేనే ఆయన కెరీర్ ముందుకు కొనసాగే అవకాశం ఉంది.
నెరవేరని దివ్యాంశ ఆశలు
అటు హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా, అవన్నీ అడియాశలుగానే మిగిలి పోయాయి. ‘మజిలీ’ తర్వాత ఈమెకు సరైన హిట్ రాలేదు. రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’, సందీప్ కిషన్ ‘మైఖేల్’ వంటి సినిమాల్లో నటించినా.. అమ్మడుకి అంతగా కలసి రాలేదు. అందుకే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచి ‘టక్కర్’ తో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. ఈ మూవీలో బోల్డ్ సీన్లే కాదు, బోల్డ్ డైలాగులు కూడా చెప్పింది. కానీ, ఈ సినిమాతో దివ్యాంశకు ఎలాంటి ఫాయిదా లేకుండా పోయింది.
Read Also: ఇండియన్ సినిమాల్లో ‘అవి’ చూపిస్తే చాలు, ప్రియాంక చోప్రా చీప్ కామెంట్స్, నెటిజన్ల ఆగ్రహం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial