Actor Suresh: పిచ్చోడా చచ్చిపోతావ్ అన్నారు - డాక్టర్లే షాకయ్యారు: నటుడు సురేష్
సీనియర్ నటుడు సురేష్ ఒకప్పుడు చాలా బరువు ఉండేవారు. కానీ, పట్టుబట్టి వెయిట్ లాస్ అయ్యారు. ఆయన డైటింగ్ విధానం చూసి డాక్టర్లే షాక్ అయ్యారట. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు.
Actor Suresh Weight Less Diet Plan: సీనియర్ నటుడు సురేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నటుడిగా 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు. కొంతకాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగారు. ఆ తర్వాత విలన్ పాత్రలనూ పోషించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే, సీరియల్స్ లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
లంచ్ తర్వాత 15 గంటలు ఏం తినను- సురేష్
ఒకప్పుడు స్లిమ్ గా ఉండే సురేష్, కొద్ది కాలం క్రితం బాగా బరువు పెరిగారు. సుమారు 120 కిలోల వరకు చేరారు. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు సినిమాల్లోనూ నటించలేదు. బరువు పెరగడం వల్లే సినిమాలు చేయడం లేదనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎలాగైనా బరువు తగ్గాలని అనుకున్నారు. గత 5 నెలలుగా కఠినమైన డైట్ ఫాలో అవుతూ, భారీగా బరువు తగ్గారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన వెయిట్ లాస్ డైట్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
“నిద్ర లేచిన తర్వాత ఒక గంట వరకు ఎలాంటి కాంప్లెక్స్ ఫుడ్స్ తీసుకోను. కేవలం, నీళ్లు, గ్రీన్ టీ తీసుకుంటాను. ఒక గంట తర్వాత అరటి పండు లేదంటే ఆపిల్ తీసుకుంటాను. అదీ కాదంటే టమాట తింటాను. 9 గంటలకు ఎగ్ లోని తెల్లసొన తింటాను. ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటాను. ఉడికించిన ఫుడ్స్ ఎక్కువగా తింటాను. లంచ్‌కు పుల్కాలు తింటాను. కాస్త రైస్ తీసుకుంటాను. సండే అయితే బిర్యానీ రైస్ తింటాను. గ్రిల్ చికెన్, గ్రిల్ ఫిష్, లేదంటే వెజిటెబుల్స్ తింటాను. మధ్యాహ్నం కడుపు నిండా ఫుడ్ తీసుకుంటాను. ఆ తర్వాత కనీసం 15 గంటల వరకు ఏం తినను. మధ్యాహ్నం ఒంటి గంటకు తింటే, మరుసటి రోజు ఉదయం వరకు ఏం తినేది ఉండదు. మంచి నీళ్లు, లేదంటే మజ్జిగలో నిమ్మరసం పిండి తాగుతాను” అని చెప్పారు.
నా డైట్ గురించి చెప్తే డాక్టర్లు షాక్ అయ్యారు- సురేష్
ఇక తన డైట్ గురించి తెలుసుకుని డాక్టర్లు షాక్ అయినట్లు సురేష్ తెలిపారు. “గత 5 నెలలుగా ఈ డైట్ ఫాలో అవుతున్నాను. 21 కేజీలు బరువు తగ్గాను. ఇప్పుడు 88 కేజీలకు చేరాను. ఈ డైట్ కు ముందు బాగా బరువు ఉండేవాడిని. వెంటనే భయపడి ఈ డైట్ మొదలు పెట్టాను. కనీసం 15 గంటలు ఏం తీసుకోకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. తినడానికి రెస్ట్ ఇవ్వడం వల్ల బరువు కూడా తగ్గిపోతాం. ఈ డైట్ మొదలు పెట్టడానికి ముందు అసలు ఏం తినకుండా ఎన్ని రోజులు ఉంటామో చూడాలి అనుకున్నాను. మూడు రోజుల వరకు ఏం తినలేదు. కేవలం నిమ్మకాయ నీళ్లు, మామూలు నీళ్లు తాగాను. అప్పుడే 6 కేజీలు తగ్గాను. డాక్టర్లకు ఫోన్ చేసి విషయం చెప్పాను. పిచ్చోడా అలా చేస్తే చచ్చిపోతావు. వెంటనే ప్రాపర్ గా తినడం మొదలు పెట్టాలని చెప్పారు. సరే అని, డైట్ లో మార్పులు చేశాను. వాకింగ్ చేయడం మొదలు పెట్టాను. మొదట్లో 5 నిమిషాలు చేసే వాడిని. తర్వాత 10 నిమిషాలు చేశాను. ఇప్పుడు రోజుకు 18 కిలో మీటర్లు వాకింగ్ చేస్తున్నాను” అని సురేష్ చెప్పుకొచ్చారు.
Read Also: మురళీమోహన్ నా శత్రువు - రాజమౌళి షాకింగ్ కామెంట్స్!