Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే..
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి గల కారణాలను మీడియా ముందుకుగా వెల్లడించారు కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలను కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఆరేళ్ల క్రితం క్యాన్సర్ కారణంగా సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చిందని.. ఆ తరువాత బైపాస్ సర్జరీ కూడా జరిగిందని చెప్పారు. వారం క్రితమే మరోవైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్ వస్తే.. దాంట్లో కూడా సగం తీసేశారని.. ఆ తరువాత రెండు రోజులు బాగానే ఉన్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ట్రీట్మెంట్ కోసం కిమ్స్ కి తీసుకురాగా.. రెండు రోజులు వైద్యం చేస్తే బాగానే రికవరీ అయ్యారని తెలిపారు.
ప్రికాస్టమీ కూడా చేశామని.. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం కాబట్టి.. మిగిలిన 55 శాతం ఊపిరితిత్హుకు ఇన్ఫెక్షన్ సోకిందని.. ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్ పై పెట్టినట్లు వివరించారు. గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్ పైనే ఉన్నారని.. ఎక్మో మిషన్‌పై ఉన్న తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ అవడంతో ఇన్‌ఫెక్షన్ శరీరమంతా సోకిందని వెల్లడించారు.
దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారని మీడియాకు తెలిపారు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం సిరివెన్నెల మృతదేహాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
Also Read:'ఆయన కలం నేడు ఆగినా.. రాసిన అక్షరాలు నిలిచే ఉంటాయి'
Also Read:సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..