Project K : నెల్లూరులో ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్
'ప్రాజెక్ట్ K' షూటింగ్ కోసం యూనిట్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామానికి వచ్చింది.
'రాధేశ్యామ్' తర్వాత ప్రభాస్ చేతిలో 4 సినిమాలున్నాయి. 'ఆదిపురుష్', 'సలార్'తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. యువ దర్శకుడు మారుతితో కూడా ఇటీవలే ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే వీటిలో ముందుగా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించే ఆది పురుష్ రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటు నాగ్ అశ్విన్ తెరకెక్కించే న్యూ మూవీ కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామానికి వచ్చింది. పెన్నా తీరంలో ఇసుక తిన్నెల వద్ద ఈ సినిమా షూటింగ్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేరు. ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సుమారు 60 మంది చిత్ర బృందం ఇక్కడ షూటింగ్ కోసం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసే వ్యక్తి జిల్లాలోని కావలి చెందిన వారు కావడంతో నెల్లూరు జిల్లాను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ షూట్ చేసిన సన్నివేశాల వీడియోలు మాత్రం సినిమా కథను రివీల్ చేస్తున్నాయి.
ఇందులో సూపర్ హీరోల్లాంటి క్యారెక్టర్లు ఉన్నాయి. వారి చేతిలో ఆయుధాలు కూడా వెరైటీగా ఉన్నాయి. అదే సమయంలో కామన్ మ్యాన్ గా కనిపించేవారు స్పేస్ సూట్ లాంటి దుస్తుల్లో ఉన్నారు. ఈ సూపర్ హీరోస్ తో ప్రభాస్ యుద్ధం చేస్తారా, లేక ప్రభాసే ఒక సూపర్ హీరోనా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్ కి హాజరు కాలేదు కాబట్టి ఆయన క్యారెక్టర్ రివీల్ కాలేదు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీనే, ఇటీవలే రాధేశ్యామ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఆదిపురుష్ కూడా రామాయణ గాథతో యూనివర్సల్ అప్పీల్ ఉన్న మూవీగా తెరకెక్కింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ సినిమాకోసం తీసిన సన్నివేశాలు చూస్తుంటే ఇది అంతకు మించి అన్నట్టుగా ఉంది. ఒకరకంగా బాహుబలి కూడా ఓ సూపర్ హీరో కథే. అయితే అక్కడ కేవలం చారిత్రక నేపథ్యం ఉంది. ఇప్పుడు మాత్రం మరింత ఆసక్తికరమైన సోషియో ఫాంటసీ కథను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఏయే రికార్డ్ లు బద్దలు కొడతారో చూడాలి..!
View this post on Instagram