Penchal Das New Song : 'అరవింద సమేత'లో 'ఏడ పోయినాడో' పాడిన పెంచల్ దాస్ కొత్త పాట - ' ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం'లో
సీమ యాసతో, విలక్షణ గొంతుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న గాయకుడు పెంచల్ దాస్. ఆయన మరో కొత్త పాటతో వచ్చారు.
పెంచల్ దాస్ (Penchal Das) గుర్తు ఉన్నారా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో 'ఏడ పోయినాడో...' ఉంది కదా! 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రితో కలిసి ఆ పాటను రాశారు. కైలాష్ ఖేర్, నిఖిత శ్రీవల్లితో కలిసి ఆలపించారు. ఆ సినిమాలో 'రెడ్డమ్మ తల్లి...' పాటను రాశారు. 'అరవింద సమేత...' తర్వాత 'శ్రీకారం'లో 'భలేగుంది బాల', 'చిత్రలహరి' సినిమాలో 'గ్లాస్ మేట్స్', నాని 'కృష్ణార్జున యుద్ధం'లో పాటలు పాడారు.
పెంచల్ దాస్ కొంత విరామం తర్వాత కొత్త పాటతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా 'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' (Akashavani Visakhapatnam Kendram Movie). 'జబర్దస్త్' ఫేమ్ సతీష్ బత్తుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ఈ సినిమాలో 'మా కలల పంటగా పుడితివి కొడుకుగా...' పాటను రాయడంతో పాటు పెంచల్ దాస్ స్వయంగా పాడారు. ఈ పాట వింటుంటే... 'అరవింద సమేత వీర రాఘవ'లో 'ఏడ పోయినాడో...' తరహాలో ఎమోషనల్ సాంగ్ అని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు.
నిర్మాత ఎంఎం అర్జున్ నిర్మాత మాట్లాడుతూ ''ఇదొక థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్. ఇప్పుడు రెండో పాటను విడుదల చేశాం. పెంచల్ దాస్ గారికి 'అరవింద సమేత', 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాల్లో పాటలకు ఎంత మంచి పేరు వచ్చిందో... ఈ పాటకూ అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం. ఇంతకు ముందు విడుదల చేసిన మొదటి పాటకు కూడా మంచి స్పందన లభించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నాం. సతీష్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. విన్న వెంటనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. చెప్పిన దాని కంటే చక్కగా తెరకెక్కించారు. యూనివర్సల్ పాయింట్ కావటంతో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని చెప్పారు.
Also Read : సప్తగిరి కాళ్ళుకు దణ్ణం పెడతానన్న బాలకృష్ణ
దర్శకుడిగా పరిచయం అవుతున్న సతీష్ బత్తుల మాట్లాడుతూ ''ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' ఒక డిఫరెంట్ లవ్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులకు థ్రిల్ అవుతారు. దేవీ ప్రసాద్, మాధవీలత వంటి సీనియర్ ఆర్టిస్టులు మా సినిమాలో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. పెంచల్ దాస్ రాసి... పాడిన ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నా'' అని చెప్పారు. ఈ చిత్రానికి విశ్వనాథ్ ఎం, హరి కుమార్ జి, కమల్ మేడగోని సహ నిర్మాతలు.
'ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం' సినిమాలో హీరోగా నటించిన శివ కుమార్ గతంలో కొన్ని సినిమాల్లో హీరో స్నేహితుడిగా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకుంటారని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.
Also Read : హాస్పిటల్‌లో ప్రభాస్ - అసలు ఏమైంది?