Model Attempts Suicide: మోడల్ గుంగున్ ఆత్మహత్యా యత్నం... హోటల్‌లో ఆరో ఫ్లోర్ నుంచి దూకే ముందు తండ్రికి ఫోన్ చేసి...
మోడల్ గుంగున్ ఉపాధ్యాయ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు. దానికి ముందు ఆమె తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు.
రాజస్తాన్ లోని జోధ్‌పూర్‌కు చెందిన మోడల్ గుంగున్ ఉపాధ్యాయ శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బలవన్మరణానికి పాల్పడే ముందు ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన వెంటనే స్పందించడంతో ప్రస్తుతానికి కుమార్తె ప్రాణాలతో ఉన్నారు. అయితే... ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
గుంగున్ ఉపాధ్యాయ, ఆమె ఫ్యామిలీ జోధ్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె వయసు 19 సంవత్సరాలు. ఆమె ఒక ఫ్యాషన్ మోడల్. శనివారం ఉదయపూర్ నుంచి జోధ్‌పూర్ వచ్చారు. అదే రోజు రాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారనేది తెలియలేదు. కానీ, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. కుమార్తె డిప్రెషన్‌లో ఉన్న విషయం ఆయనకు అర్థం అయ్యింది. ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా... మాట వినలేదు. ఆత్మహత్యకు సిద్ధపడినట్టు చెప్పారు.
కుమార్తె గుంగున్ మానసిక స్థితిని అంచనా వేసిన తండ్రి గణేష్ ఉపాధ్యాయ వెంటనే పోలీసులుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఫోన్ నుంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు... లార్డ్ ఇన్ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఆరో ఫ్లోర్ నుంచి గుంగున్ దూకేశారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. రెండు కాళ్లు విరిగాయని, ఛాతికి బలమైన గాయాలు అయ్యాయని సమాచారం. రక్తం ఎక్కువ పోవడంతో ప్రస్తుతం బ్లడ్ అందిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి గుంగున్ అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆమె స్పృహలోకి వస్తే ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు? అనే కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.
View this post on Instagram