Mammootty Biryani: దర్శకుడు గౌతమ్ మీనన్‌కు బిర్యానీ వడ్డించిన మమ్ముట్టి... సోషల్ మీడియాలో వైరల్ వీడియో
మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి దర్శకుడు గౌతమ్ మీనన్ కు అదిరిపోయే బిర్యానీ రుచి చూపించారు. సినిమా సెట్స్ లో మమ్ముట్టి స్వయంగా వంట చేసి అందరికీ వేడి వేడి బిర్యానీ వడ్డించారు.
Mammoottys Special Biryani Surprise: మలయాళ సినీ పరిశ్రమలో మాంచి ఫామ్ లో ఉన్నారు సీనియర్ నటుడు మమ్ముట్టి. కుర్ర హీరోలకు మించి అవకాశాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘కాథల్ ది కోర్’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న ఆయన... ఈ ఏడాది ‘భ్రమ యుగం’, ‘టర్బో’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అద్భుతంగా అలరించారు. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం మమ్ముట్టి ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
దర్శకుడికి స్పెషల్ బిర్యానీ రుచి చూపించిన మమ్ముట్టి
తాజాగా ఈ సినిమా సెట్స్ లో మమ్ముట్టి దర్శకుడు గౌతమ్ మీనన్ తో పాటు చిత్రబృందానికి సర్ ప్రైజ్ ఇచ్చారు. తనే స్వయంగా బిర్యానీ వండి అందరికీ వడ్డించారు. ‘మమ్ముక్క స్పెషల్ బిర్యానీ’గా పిలిచే ఈ స్పెషల్ ఫుడ్ ను అందరికీ రుచి చూపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మమ్ముట్టి స్వయంగా గరిటె తిప్పుతూ వంట చేశారు. బిర్యానీ రెడీ అయ్యాక తొలుత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు వడ్డించారు. ఆ తర్వాత చిత్ర బృందానికి పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి తన షూటింగ్ చివరి రోజు కావడంతో ఆయన అందరికీ బిర్యాని వండి పెట్టారు. చిత్రబృందంతో కలిసి మమ్ముట్టి కూడా బిర్యానీ టేస్ట్ చేశారు. ఈ వీడియో చూసి సినీ అభిమానులు మమ్ముట్టిని అభినందిస్తున్నారు. చిత్రబృందంతో ఆయన కలిసిపోయిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.
.@mammukka ‘s special biriyani on the sets of his next for his director @menongautham
— Rajasekar (@sekartweets) September 4, 2024
pic.twitter.com/fDG32ukZ7Z
‘బాజూకా’ పేరుతో తెరకెక్కుతున్న మమ్ముట్టి, గౌతమ్ మీనన్ మూవీ
‘ఏ మాయ చేసావే’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలిసారి మలయాళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ ‘బాజూకా’ పేరుతో రూపొందుతోంది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘బాజూకా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఎబిసిడి’ సినిమాకు గౌతమ్ మీనన్ స్క్రిప్ట్ రాయగా, ఇప్పుడు మమ్ముట్టితో మూవీ చేస్తున్నారు.
బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచిన ‘టర్బో’
మమ్ముట్టి చివరగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టర్బో'లో నటించారు. యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అంజనా జయ ప్రకాశ్, రాజ్ బి.శెట్టి, శబరీష్ వర్మ, సునీల్, కబిర్ దుహాన్ సింగ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. మే 23న మలయాళంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్ గా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. ఆగస్టు 9 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నది.
Read Also: అల్లు అర్జున్ కు మరో ఆప్షన్ లేదా? నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్ తో చేయక తప్పదా?