Karan Johar twitter: అమ్మను, పిల్లలను తిట్టడం తట్టుకోలేకపోయా, అందుకే అక్కడ ఉండొద్దు అనుకున్నా-కరణ్ జోహార్
బాలీవుడ్ దిగ్గజ దర్శకనిర్మాత కరణ్ జోహార్ గత ఏడాది ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా తాను ట్విట్టర్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో వివరించారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ గత ఏడాది(2022) అక్టోబర్ లో ట్విట్టర్ నుంచి వెళ్లిపోయారు. అకౌంట్ ను డీయాక్టివేట్ చేసే ముందు పాజిటివ్ వైబ్స్ కోసం ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. అసలు కారణాన్ని వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ట్విట్టర్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని వివరించారు.
పిల్లల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నా
తనతో పాటు తన పిల్లల గురించి చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేయడం వల్లే ట్విట్టర్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “నేను ట్విట్టర్ ను వదిలివేయడానికి అసలు కారణం నా పిల్లల గురించి నెటిజన్లు విమర్శలు చేయడం. నన్ను ట్రోల్ చేసినా, విమర్శించినా, పెద్దగా పట్టించుకోను. వారి ప్రశ్నలకు సమాధానం చెప్తాను. కానీ, చిన్న పిల్లల గురించి చెడుగా మాట్లాడ్డం తట్టుకోలేకపోయాను. మా అమ్మ గురించి కూడా చెడుగా మాట్లాడారు. వృద్ధురాలు అయిన మా అమ్మ గురించి అలా మాట్లాడటం పట్ల బాధ పడ్డాను. మా ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడటాన్ని తట్టుకోలేకే ట్విట్టర్ నుంచి తప్పుకున్నాను. ట్విట్టర్ మంచి ఫ్లాట్ ఫారమ్ అయినా, నేను ఈ సామాజిక వేదిక మీదకి మళ్లీ రావాలి అనుకోవడం లేదు. ఒక పేరెంట్‌గానే కాకుండా మనిషిగా కూడా నా హృదయాన్ని గాయపరిచిన ట్విట్టర్ లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వలేను” అని చెప్పుకొచ్చారు.
ఆ కారణంగా వెళ్లిపోయాను అనేది నిజం కాదు!
నిర్మాతగా తనపై వచ్చిన నెపోటిజం ఆరోపణల కారణంగా తాను ట్విట్టర్‌ను విడిచిపెట్టలేదని కరణ్ స్పష్టం చేశారు. “నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులను కాస్టింగ్ చేయడం మానేశాను అని కాదు. టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడం కామన్. అంతేకానీ, ఎవరినీ ఎదగనీయడం లేదనే వాదలను నిజం కాదు. ఆ విమర్శలను కూడా నేను పెద్దగా పట్టించుకోను” అని కరణ్ వివరించారు.
చాలా కాలంగా నెపోటిజం విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్
ఇక కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెండ్ డైరెక్టర్ గా మారారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, కరణ్ ఎక్కువగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన వారి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారనే విమర్శలున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. కరణ్ జోహార్ సినిమాలను బాయ్ కాట్ చేయాలనే ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ సినిమాకి కూడా కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా బాయ్ కాట్ బాలీవుడ్ ప్రచారం దెబ్బకు డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలోనే విమర్శలు తీవ్రం కావడంతో ట్విట్టర్ నుంచి ఆయన తప్పుకున్నారు. కరణ్ చివరిగా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ చిత్రానికి దర్శత్వం వహించారు. ఇందులో అలియా భట్, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళు చేసింది.
Read Also: 'సో స్వీట్ ఆఫ్ యూ..' బన్నీ ట్వీట్ కి నయన్ స్పందన ఇదే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial