IMDb Most Popular Stars List: 2022 మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో దక్షిణాది తారల హవా, టాప్ 10లో ఆరుగురు మనోళ్లే!
ఈ ఏడాది మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టులో సౌత్ హీరోలు సత్తా చాటారు. ఈ జాబితాలో ధనుష్ నెంబర్ వన్ గా నిలిచాడు. టాలీవుడ్ నుంచి ముగ్గురు హీరోలు టాప్ 10 లిస్టులో చోటు దక్కించుకున్నారు.
సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్ ఈ ఏడాది చక్కటి విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచాడు. ‘మారన్’, ‘నానే వరువేన్’ ‘తిరుచిత్రంబళం’ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు. హాలీవుడ్‌లో ది గ్రే మ్యాన్‌తో అరంగేట్రం చేశాడు. చక్కటి ప్రతిభ కనబర్చడంతో, IMDb ధనుష్‌ను 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ స్టార్‌గా గుర్తించింది.
Aaaand we have arrived at the moment we’ve all been waiting for 🥁 Presenting the IMDb Top 10 Most Popular Indian Stars of the year 💛
— IMDb India (@IMDb_in) December 7, 2022
Who was your favourite Indian star this year? 🎬⭐️ #IMDbBestof2022 pic.twitter.com/w6deLsCZ9y
టాప్-3లో ధనుష్, ఆలియాభట్, ఐశ్వర్యారాయ్
తాజాగా IMDb ఈ ఏడాది దేశంలో బాగా ప్రజాదరణ పొందిన టాప్ 10 నటీనటుల లిస్టును విడుదల చేసింది. ఆయా హీరో, హీరోయిన్ల హిట్స్, ఆడియన్స్ ఓట్ల ఆధారంగా టాప్ ఇండియన్ స్టార్స్ లిస్టును రూపొందించింది. ఈ జాబితాలో, అసురన్ స్టార్ ధనుష్ అగ్రస్థానంలో నిలిచాడు. ‘గంగూబాయి కతియావాడి’, ‘RRR’, ‘డార్లింగ్స్’, ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ లాంటి సినిమాతో సత్తా చాటిన ఆలియా భట్ 2వ స్థానాన్ని సంపాదించింది. ‘పొన్నియన్ సెల్వన్-1’లో నటనకు గాను ఐశ్వర్యరాయ్ బచ్చన్ 3వ స్థానంలో నిలిచింది.
టాప్-10లో ముగ్గురు టాలీవుడ్ హీరోలకు చోటు
ఇక టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీలో అల్లూరి సీతారాం రాజు లాంటి పవర్ ఫుల్ రోల్ చేసి రామ్ చరణ్ ఈ లిస్టులో 4వ స్థానంలో నిలిచారు. ‘యశోద’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంతా రూత్ ప్రభు, ‘విక్రమ్ వేద’ స్టార్ హృతిక్ రోషన్ 5, 6వ స్థానాలను పొందారు. హృతిక్ రోషన్ తర్వాత ఈ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ ‘గుడ్ న్యూజ్’ స్టార్ కియారా మాత్రమే. మిగతా స్థానాల్లో వరుసగా ‘RRR’ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, పుష్ప స్టార్ అల్లు అర్జున్, KGF స్టార్ యష్ నిలిచారు.
ఈ లిస్టుపై నెటిజన్లలో మిశ్రమ స్పందన
IMDb ఈ లిస్టును ప్రకటించిన వెంటనే ధనుష్ అభిమానులు ఓ రేంజిలో సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని చోట్ల ఆయన అభిమానులు సంబరాలు జరిపారు. ధనుష్ ఇకపై గ్లోబల్ స్టార్ అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఐశ్వర్యారాయ్ అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఈ ర్యాంకింగ్స్ ను మరికొంత మంది నెటిజన్లు తప్పుబట్టారు. కచ్చితమైన అభిప్రాయ సేకరణ లేకుండా ఈ లిస్టును విడుదల చేసినట్లు విమర్శిస్తున్నారు.
Read Also: అతను నా దవడ విరిగేలా కొట్టాడు, ఆ దెబ్బలకు చనిపోతా అనుకున్నా: ఆశా షైనీ