Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!
కృష్ణ పెద్ద కర్మలో ఆయన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడారు.
సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ ‘నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. ఆయన ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి వుంటాను. నాన్న గారు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. మీ గుండెల్లో వుంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ దశదినకర్మ కార్యక్రమానికి మైనపు విగ్రహాన్ని తయారు చేశామని కోనసీమ జిల్లా కొత్తపేట శిల్పి వడియార్ తెలిపారు. కృష్ణ విగ్రహాన్ని హైదరాబాద్ పంపించామని చెప్పారు. హీరో కృష్ణ యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలా విగ్రహాన్ని తయారు చేయాలని కుటుంబ సభ్యులు కోరారన్నారు. వచ్చే ఏడాది మే నెలలో కృష్ణ జయంతిని పురస్కరించుకుని కాకినాడ, వైజాగ్, విజయవాడలో ఏర్పాటు చేయనున్న భారీ విగ్రహాలు కూడా తానే రూపొందిస్తున్నానని శిల్పి వడియార్ వెల్లడించారు. రాజమండ్రిలో హీరో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న విగ్రహం కావాలంటూ కొందరు అభిమానులు సంప్రదించారని ఇవన్నీ త్వరలోనే రూపొందిస్తామన్నారు.
అల్లూరి వేషధారణలో విగ్రహం
"సూపర్ స్టార్ కృష్ణ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదానికి గురిచేసింది. దశదిన కర్మకు విగ్రహాన్ని తయారుచేయాలని కృష్ణ కుటుంబ సభ్యులు నన్ను సంప్రదించారు. ఆయన 27 సంవత్సరాల వయసులో ఎలా ఉండేవారో అలా ప్రతిమను రూపొందించాం. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ పంపిస్తున్నాం. 27వ తేదీన జరిగే సంతాప సభలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. కాకినాడ, విజయవాడ, వైజాగ్ లో కృష్ణ కాంస్య విగ్రహాలు ఏర్పాటుచేసేందుకు ఆయన అభిమానులు నాకు ఫోన్ చేస్తున్నారు. వచ్చే మే నెలలో ఆయన జయంతి సందర్భంగా ఈ విగ్రహాలు ఏర్పాటుచేయనున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులు రెండు విగ్రహాలు తయారు చేయమన్నారు. వాటిని రూపొందించి హైదరాబాద్ పంపించాం. రాజమండ్రి, వైజాగ్ లో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఉన్న విగ్రహాలు ఏర్పాటుచేసేందుకు నన్ను ఫోన్ లో సంప్రదించారు. వాటిని కూడా రూపొందిస్తాం." - శిల్పి వడియార్
కృష్ణ పేరుతో స్మారక పురస్కారం
సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కున కోల్పోయింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలందించడమే కాకుండా సాంకేతికంగా అభివృద్ధి కావడానికి ఎంతో కృషి చేశారు ఆయన. అందుకే కృష్ణ పేరు మీద సినీ రంగానికి సేవలందించిన వారికి ప్రతీ ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ను ప్రదానం చేస్తామని ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. అయితే దీనిపై త్వరలో మహేష్ బాబును కూడా కలిసి అవార్డు గురించి చర్చించనున్నామని ఆయన అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఎంపిక ప్రజా బ్యాలెట్ ద్వారా జరుగుతుందని చెప్పారు. ఆ ప్రజా బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిలో విజేతలను జ్యూరీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పురస్కార వేడుక జరిగే తేదీని కూడా త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. పారదర్శకత కోసం విధి విధానాలపై జ్యూరీ ప్రాథమిక చర్చలు పూర్తి చేసిందని, ప్రతి ఏటా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తెనాలికి సూపర్ స్టార్ చేసిన సేవల్ని, ఆయన జ్ఞాపకాలను మరువలేకే ఈ అవార్డుకు శ్రీకారం చుట్టినట్లు దిలీప్ రాజా తెలిపారు.
350పైగా సినిమాలు చేశారు
సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన 50 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగానూ ఆయన ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. ఆయన చేసిన ప్రయోగాలు తెలుగు సినిమా పరిశ్రమ సాంకేతికంగా అభివృద్ధి కావడానికి ఎంతో ఉపయోగపడ్డారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ లాంటి పురస్కారాలు కృష్ణను వరించాయి. సినిమాల్లో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినా.. ఆయన తన కన్న వారిని, పెరిగిన ఊరుని మర్చిపోలేదు. ఆయన సినిమాలు విడుదలైన ప్రతీ సారి సొంత ఊరు బుర్రిపాలెం వెళ్లి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకునేవారు. అందరితో కలిసి సినిమాను చూసేవారు. ఊరి అభివృద్ధికీ ఎంతో కృషి చేశారు. ఇదే స్ఫూర్తితో మహేష్ బాబు ఆ ఊరిని దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.