Comedian Ali: ఆలీ... సినిమాల్లో మళ్లీ బిజీ - 'సండే గర్ల్ ఫ్రెండ్'లో మెయిన్ లీడ్
Sunday Girlfriend Movie: కమెడియన్ ఆలీ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో మరో సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు ఏమిటి? ఇతర విశేషాలు ఏమిటి? అంటే...
నటుడిగా, హాస్య నటుడిగా, కథానాయకుడిగా ఆలీ ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో విజయాల్లో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అయితే... కొంత కాలంగా ఆయన జోరు తగ్గింది. ఇటీవల 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో కనిపించారు. కొత్త సినిమాలు కొన్నిటికి సంతకం చేశారు. హాస్య నటుడిగా మాత్రమే కాకుండా... ప్రధాన పాత్రలకూ ఆయన సై అంటున్నారు. తాజాగా ఓ కొత్త సినిమాకు ఆయన క్లాప్ కొట్టారు. అందులో మెయిన్ లీడ్ ఆయన. ఆ సినిమా విశేషాలు ఏమిటి? అనేది చూస్తే...
సండే గర్ల్ ఫ్రెండ్... ఆదివారం ప్రేయసి!
ఆలీ (Comedian Ali) ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'సండే గర్ల్ ఫ్రెండ్' (Sunday Girlfriend Movie). కామ్నా శర్మ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. సుమన్ మరో ప్రధాన పాత్రధారి. దీనికి గడ్డం వెంకట రమణా రెడ్డి దర్శకుడు. కథ, కథనం, మాటలతో పాటు పాటలు కూడా ఆయన రాస్తుండటం విశేషం. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా లార్విన్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం అయ్యింది.
'సండే గర్ల్ ఫ్రెండ్' ప్రారంభోత్సవంలో దేవుని చిత్రపటాలు ముందు కామ్నా శర్మ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆలీ క్లాప్ ఇవ్వగా... చిత్ర బృందానికి సుమన్ స్క్రిప్ట్ అందజేశారు. నటి ఇంద్రజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ట్రెండీ లవ్ స్టోరీతో 'సండే గర్ల్ ఫ్రెండ్'
ఈతరం యువతీ యువకుల ఆలోచనలకు తగ్గట్టు ట్రెండీ లవ్ స్టోరీతో 'సుండే గర్ల్ ఫ్రెండ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని దర్శకుడు గడ్డం వెంకట రమణా రెడ్డి చెప్పారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''నేను 'సీఎం పెళ్లాం' అని ఓ సినిమా తీస్తున్నా. రాజకీయ నేపథ్యంలో సందేశాత్మక కథతో రూపొందుతున్న సినిమా అది. దాని తర్వాత సినిమా సేమ్ జానర్ కాకుండా పూర్తిగా కొత్తగా ఉండాలని ఈ సినిమా మొదలు పెట్టా. ఇదొక లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్. ఆల్రెడీ పాటల రికార్డింగ్ పూర్తి చేశాం. అవి ట్రెండీగా ఉంటాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం'' అని చెప్పారు. కథానాయిక కామ్నా శర్మ మాట్లాడుతూ... ''నేను ముంబై అమ్మాయిని. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకట రమణా రెడ్డి గారికి థ్యాంక్స్'' అని అన్నారు.
Also Read: 'ధూమ్ 4'లో సూర్య... బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రోలెక్స్‌కు ఛాన్స్?
Sunday Girlfriend Telugu Movie Cast And Crew: కామ్నా శర్మ, సుమన్, ఆలీ, 'ఘర్షణ' శ్రీనివాస్, షాలినీ నాయుడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాణ సంస్థ: లార్విన్ మూవీస్, ఛాయాగ్రహణం - ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగ శ్రీనివాస్ రెడ్డి, కూర్పు: రామారావు, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, కథ - కథనం - మాటలు - పాటలు - దర్శకత్వం: గడ్డం వెంకట రమణా రెడ్డి.