Suma Kanakala - Varanasi: సుమ కనకాల లేకపోతే... 'వారణాసి' గ్లోబల్ ఈవెంట్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించావ్ కదక్కా
Varanasi title reveal event highlights: 'వారణాసి' టైటిల్ రివీల్ ఈవెంట్‌లో అన్ సంగ్ హీరో ఎవరంటే... నిస్సందేహంగా సుమ కనకాల అని చెప్పాలి. ఒంటిచేత్తో ఈవెంట్‌ను గట్టెక్కించింది. ఆమె లేకపోతే... ఊహించుకోలేం.

'వారణాసి' టైటిల్ రివీల్ - గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ (Varanasi Title Reveal Globetrotter Event) ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్, టైటిల్ గ్లింప్స్ గురించి ఒక్క ఘట్టమనేని అభిమానులు మాత్రమే కాదు... ఆడియన్స్ అందరూ మాట్లాడుతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అదరగొట్టారని చెబుతున్నారు. అయితే ఈవెంట్ మొత్తం మీద అన్ సంగ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సుమ కనకాల (Suma Kanakala) అని చెప్పాలి. ఆవిడ లేని ఫంక్షన్ ఊహించుకోలేం.
ఒంటిచేత్తో గట్టెక్కించిన సుమ
తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా భారీ సినిమా ఈవెంట్ చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చే యాంకర్ సుమ కనకాల. కొన్నేళ్ళుగా యాంకరింగ్‌లో ఆవిడ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. కొత్తవాళ్లను ఆవిడ రానివ్వడం లేదని కొన్ని విమర్శలు అప్పుడప్పుడూ వినబడతాయి. అయితే 'వారణాసి' ఈవెంట్ చూస్తే... సుమ బదులు కొత్తవాళ్ళు ఉంటే ఆ స్థాయిలో మేనేజ్ చేయగలరా? అసలు ఆ పరిస్థితిలో సుమ బదులు మరొకరిని ఊహించుకోగలమా?? ఒంటిచేత్తో ఈవెంట్ అంతటినీ సుమ కనకాల గట్టెక్కించారు.
Also Read: 'వారణాసి'లో పూరి జపం... 'పోకిరి' వెంట టోటల్ టీమ్!
వంద అడుగుల ఎల్ఈడీ స్క్రీన్ మీద 'వారణాసి' టైటిల్ రివీల్ వీడియో ప్లే కాలేదు. రాజమౌళి అనౌన్స్ చేసిన వెంటనే వీడియో ప్లే అయితే సుమ గొప్పదనం, ఆవిడ వాక్చాతుర్యం జనాలకు నిజంగా తెలిసేది కాదు. ఆడియన్స్ అందరూ వీడియో కోసం ఎదురు చూస్తున్న సమయంలో మరో పది పదిహేను నిమిషాలు పట్టొచ్చని తెలిసింది. ఆ తరుణంలో సుమ రంగంలోకి దిగారు. రామా రాజమౌళితో మాటలు మొదలు పెట్టారు. ఆవిడ మెల్లగా మాట్లాడుతున్నారు. అప్పుడు మాకు ఈ మాత్రం ల్యాగ్ కావాలని చిన్న సెటైర్ వేశారు. విజువల్స్, గ్రాఫిక్స్ షాట్స్ వస్తున్నాయని మరొక మాట చెప్పారు. చేతిలో స్క్రిప్ట్ లేకున్నా తన వీలైనంత వరకు టైం మేనేజ్ చేశారు. మొత్తం రెడీ అయ్యాక రాజమౌళి వచ్చి 'ఓకే సుమ' అని చెప్పారంటే ఆవిడ శ్రమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. పీఎస్ వినోద్‌తో సంభాషణలోనూ నవ్వించే ప్రయత్నం చేశారు.
వీడియో ప్లే అవ్వని తరుణంలో మేనేజ్ చేయడం మాత్రమే కాదు... అంతకు ముందు కూడా సుమ ఒంటి చేత్తో ఈవెంట్ నడిపించారు. 'వారణాసి' టైటిల్ రివీల్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఈవెంట్. అందుకని తెలుగు నుంచి సుమను యాంకర్‌గా తీసుకున్నారు. ఆవిడ మలయాళీ కనుక మధ్యలో కొన్ని మలయాళం డైలాగులు చెబుతారు. కన్నడ వాళ్ళకు తెలుగు అర్థం అవుతుంది. హిందీ కోసం ఆశిష్ అని అప్ కమింగ్ ఆర్టిస్ట్ కమ్ యూట్యూబర్ (Ashish Chanchlani)ని తీసుకు వచ్చారు. సుమ కనకాల ఎనర్జీని మ్యాచ్ చేయడం అనేది పక్కన పెట్టండి... అసలు మినిమమ్ కూడా ఎంగేజ్ చేయలేకపోయాడు. అతని మీద సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పడుతున్నాయి.





















