కమెడియన్ సుధాకర్ కుమారుడి పెళ్లి - దగ్గరుండి మరీ జరిపించిన బ్రహ్మానందం, ఫోటోలు వైరల్!
Sudhakar Son's Marriage : సీనియర్ హాస్య నటుడు సుధాకర్ ఏకైక కుమారుడి పెళ్లి తాజాగా జరిగింది. స్నేహితుడి కుమారుడి పెళ్లిని బ్రహ్మానందం దగ్గరుండి మరీ జరిపించారు.
Senior Comedian Sudhakar Son's Marraige : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో కమెడియన్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు హాస్యనటుడు సుధాకర్. వందలాది సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఒకానొక దశలో సుధాకర్ బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్‌ను డామినేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కమెడియన్ గానే కాదు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమా పరిశ్రమలో కొనసాగారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వల్ల సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 17ఏళ్లుగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తున్న సుధాకర్ ఏకైక కుమారుడి పెళ్లి తాజాగా జరిగింది.
స్నేహితుడి కుమారుడి పెళ్లిని దగ్గరుండి జరిపించిన బ్రహ్మానందం
సుధాకర్ కమెడియన్, బ్రహ్మానందం ఇద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఇక తన స్నేహితుడి కుమారుడి పెళ్లిని బ్రహ్మానందం దగ్గరుండి మరీ జరిపించారు. పెళ్లి పనులు మొదలైనప్పటి ముగిసే వరకు అంతా తానై వ్యవహరించారు. అంతేకాదు పెళ్లిలో తనదైన శైలిలో నూతన దంపతులతో జోకులు వేస్తూ వచ్చిన అతిధులు అందరిని ఎంతగానో నవ్వించారు. అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. కాగా సుధాకర్ ఏకైక కుమారుడు బెనెడిక్ట్ మైకేల్(బెన్ని) వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహ వేడుకకి బ్రహ్మానందంతో పాటు సీనియర్ నటుడు జగపతిబాబు, జె.డి చక్రవర్తి, రోజా రమణి, చంద్రబోస్ దంపతులు సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.
నడవలేని స్థితిలో సుధాకర్
సుధాకర్ కుమారుడి వివాహానికి సంబంధించిన ఫోటోలను చూసిన నెటిజన్స్ సుధాకర్ పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలో సుధాకర్ చాలా బక్కచిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరి సాయంతో ఆయన మండపం పైకి వచ్చారు. ఈ ఫోటోల్లో సుధాకర్ చాలా నీరసంగా కనిపించడంతో ఒకప్పుడు అందరినీ కడుపుబ్బా నవ్వించిన సుధాకర్ ఇప్పుడు ఇలా మారిపోయారేంటీ? అని అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
హీరోగానూ అలరించిన సుధాకర్
టాలీవుడ్ లో కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ హీరోగా కూడా మెప్పించారు. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసుకు వెళ్లిన సుధాకర్ కి దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడింది. ఆయన సుధాకర్‌ను హీరోగా పెట్టి 'కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్' సినిమా తీశారు. అందులో సుధాకర్‌కు జోడిగా రాధిక నటించింది. ఈ సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు రావడంతో హైదరాబాద్ కు వచ్చారు. ఇక ఇక్కడ కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అగ్ర హీరోల సినిమాల్లో రాణించారు.
Also Read : ‘సరిపోదా శనివారం‘ గ్లింప్స్: వారంలో ఒక్క రోజు మాత్రమే కోపం చూపించే పిచ్చినా కొడుకుని చూశారా?