Samantha: ఎదురు దాడికి బదులు చర్చ పెడితే బాగుండేది, డబ్బు కోసం అలా చెయ్యలేదు - సమంత
హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి నటి సమంత సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుపై పలువురు డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అభ్యంతరంపై సమంత సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
Samantha Ruth Prabhu Clarification: నటి సమంతా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. నెబ్యులైజర్ సాయంతో మెడిసిన్ తీసుకుంటున్న ఫోటో షేర్ చేసిన సమంతా, కీలక విషయాలు వెల్లడించింది. సాధారణ వైరల్ మెడిసిన్స్ తీసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ మిశ్రమంతో ఆవిరి పట్టడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకొచ్చింది. అవనసరంగా టాబ్లెట్లు మింగడం కన్నా, ఇలా చేయడం ఉత్తమని రాసుకొచ్చింది. సమంత సూచనపై పలువురు డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. ఆమె చెప్పిన మాట వింటే చావు ఖాయం అంటూ మండిపడ్డారు. మరో డాక్టర్ తప్పుడు విధానాన్ని ప్రచారం చేసిన సమంతను ఏకంగా జైల్లో వేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదంపై క్లారిటీ ఇచ్చిన సమంత
తాజాగా ఈ వివాదంపై సమంత క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదంపై సుదీర్ఘ వివరణ ఇచ్చింది. డాక్టర్లు చెప్పిన విధానాన్ని తప్పుబట్టకుండా, వారు వాడిన పదజాలంపై తీవ్రంగా స్పందించింది. "గత రెండు సంవత్సరాలుగా, నేను అనేక మెడిసిన్స్ తీసుకోవలసి వచ్చింది. నేను పాటించిన తర్వాత మంచి ఫలితాలు ఉంటేనే ఎదుటివారు తీసుకోవాలని చెప్తాను. నేను తీసుకున్న ట్రీట్మెంట్ చాలా ఖరీదైనది. చాలా కాలంగా సంప్రదాయ ట్రీట్మెంట్ నా ఆరోగ్యాన్ని మెరుగుపరచలేదు. సంప్రదాయ, శాస్త్రీయ వైద్యాలను తీసుకున్నాను. వాటిని ప్రయత్నించిన తర్వాత నాకు చక్కటి ఫలితాలను ఇచ్చిన చికిత్సలను గుర్తించాను. ఒక చికిత్స విధానంపై నేను గట్టిగా వాదించే అమాయకురాలిని కాదు. గత రెండు సంవత్సరాలలో నేను ఎదుర్కొన్న, మంచి ఫలితాన్ని పొందిన వాటిని ఇతరులు కూడా పాటించాలని మంచి ఉద్దేశంతో సూచించాను” అని వివరించింది.
డాక్టర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
అటు తనపై తీవ్ర విమర్శలు చేసిన డాక్టర్ పై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఒక పెద్దమనిషి నా పోస్ట్ పై, నా ఉద్దేశంపై తీవ్ర పదజాలంతో అటాక్ చేశాడు. ఆ పెద్ద మనిషి కూడా వైద్యుడే. అతడికి నాకంటే ఎక్కువ విషయాలు తెలుసు. అతడి ఉద్దేశాలు గొప్పవని నేను భావిస్తున్నాను. ఆయన తన మాటలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా, ఎందుకు మంచిది కాదో వివరించి ఉంటే తనపై గౌరవంగా ఉండేది. అతడు ఏకంగా నన్ను జైలులో వేయాలన్నాడు. ఫర్వాలేదు. నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేను ఆ పోస్టు పెట్టలేదు. సంప్రదాయ మందులు పని చేయని కొత్త చికిత్సల కోసం వెతుకుతున్న వారికి నేను ఓ సూచన చేశాను” అని వివరించింది.
విమర్శలకు బదులు చర్చ జరిపితే బాగుండేది!
అటు తనను టార్గెట్ చేయడం కంటే చర్చ జరిపి ఉంటే బాగుండేదని సమంత అన్నారు. "నేను చేసిన సూచనపై సదరు డాక్టర్ విమర్శలు చేయడం కంటే చర్చకు వస్తే బాగుండేది. నాకు ఈ సూచన చేసిన డాక్టర్ ను పిలిచి చర్చించే దాన్ని. ఇద్దరు అనుభవం ఉన్న డాక్టర్ల మధ్య చర్చ జరిగితే చాలా మందికి మంచి విషయాలు తెలిసే అవకాశం ఉండేది. నా ఆరోగ్యానికి సాయపడిని ట్రీట్మెంట్ గురించి నేను ఎదుటి వారికి రిఫర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరికీ హాని కలగకూడదని భావిస్తాను. ప్రతి చికిత్సకు వ్యతిరేక, అనుకూల విధానాలు ఉంటాయి. మంచిని మాత్రమే తీసుకోవడం మంచిది” అని సమంతా చెప్పుకొచ్చింది.
View this post on Instagram
సమంత పోస్టుపై డాక్టర్లు ఏమన్నారంటే?
హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ గురించి నటి సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై ముంబైలోని వోక్‌హార్డ్ హాస్పిటల్స్ డాక్టర్ రితుజా ఉగాల్ ముగ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వెల్లడించారు. ఆక్సిడేటివ్ స్ట్రెస్, శ్లేష్మ పొరలో చికాకు, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. అటు ది లివర్ డాక్ పేరుతో సోషల్ మీడియాలో ఉన్న డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలప్స్ సమంత చెప్పిన నెబ్యులేషన్ విధానం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. హెల్త్, సైన్స్ విషయంలో ఆమె ఓ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటూ విమర్శించారు. ప్రాణాంతకమైన ఈ విధానాన్నిసూచించిన ఆమెను జైల్లో వేయాలన్నారు.
Read Also: ఆర్జీవీ, రాజమౌళి నటిస్తారని నాకూ తెలియదు, ‘కల్కి’ రెండో భాగం ఎలా ఉంటుందో హింట్ ఇచ్చిన అశ్వినీ దత్