Ashwini Dutt: ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారేమో? నంది అవార్డులపై అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు
సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులను గత కొంత కాలంగా తెలుగు ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. మళ్లీ ఈ అవార్డులను ఇచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు నిర్మాత అశ్వినీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేవి. ప్రతి ఏటా సినీ రంగంలోని 24 రంగాలల్లో ప్రతిభ కనబర్చిన వారికి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. సినీ పరిశ్రమలో పని చేసే వారు నంది అవార్డు రావడాన్ని గౌరవంగా భావించే అవారు. కానీ, రాష్ట్ర విడిపోయాక, నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నంది అవార్డులను ఇవ్వడం నిలిపేశాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అనే పేరును మార్చి మరో పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించినా, ఇప్పటి అతీగతీ లేదు. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించినా, కొద్ది సంవత్సరాలుగా ఇవ్వడం లేదు.
తాజాగా నంది అవార్డులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోవడాన్ని ప్రముఖ నిర్మాతలు అశ్వినిదత్, ఆది శేషగిరిరావు తీవ్రంగా తప్పుబట్టారు. మే 31న దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు ఆది శేషగిరిరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ప్రొడ్యూసర్ సి.అశ్వినీదత్ సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నంది అవార్డుల గురించి ప్రస్తావించారు.
ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అనే అవార్డులు ఇస్తారేమో?- అశ్వినీదత్
నంది అవార్డుల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత అశ్వినీదత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తోందన్నారు. “ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నంది అవార్డులు కాదు, ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అనే అవార్డులు ఇస్తారు. సినిమాలకు ఇచ్చే రోజులు మరో రెండు, మూడు ఏళ్లలో వస్తాయి” అన్నారు.
ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే నంది అవార్డులు- ఆది శేషగిరిరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక నంది అవార్డులకు ప్రాధాన్యత తగ్గిపోయిందని నిర్మాత ఆది శేషగిరిరావు చెప్పారు. రెండు తెలుగు ప్రభుత్వాలకు ఈ అవార్డు ఇవ్వడంపై ఆసక్తి లేదన్న ఆయన.. నంది అవార్డుల కంటే సంతోషం అవార్డులు ఘనంగా నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు నంది అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉండేదని.. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. అసలు తన ఉద్దేశంలో 'నంది అవార్డు'లకు ప్రాముఖ్యతే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే నంది అవార్డులను ప్రదానం చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
నంది అవార్డులపై గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభను కాకుండా,కేవలం ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న వారికే అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శలు చేశారు. తాజాగా ఆది శేషగిరిరావు, అశ్వినీదత్ లాంటి వారు కూడా ఈ తరహా కామెంట్సే చేయడం, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: కృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్ - 4K క్వాలిటీతో ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్, ఎప్పుడో తెలుసా?