Thangalaan Making Video: నమ్మండి, ఇతడు చియాన్ విక్రమ్ - ‘తంగలన్’ మూవీ మేకింగ్ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు
చియాన్ విక్రమ్, పారంజిత్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 'తంగలన్'. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇందులో విక్రమ్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం 'తంగలన్'. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి, తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023 మోస్ట్ అవైటెడ్ మూవీగా క్రేజ్ దక్కించుకుంది 'తంగలన్'. ఈ మూవీ మొదలైన నాటి నుంచి అభిమానులను ఆసక్తిగా గమనిస్తున్నారు. విక్రమ్ గతంలో ఏ చిత్రంలోనూ కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. స్పెషల్ కంటెంట్ తో ఆకట్టుకోబోతున్నారు. హిస్టారికల్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి అదిరిపోయే కంటెంట్ రిలీజ్ చేశారు దర్శకుడు రంజిత్.
Happy birthday to my #Thangalaan, @chiyaan sir 😊
— pa.ranjith (@beemji) April 17, 2023
Presenting you a slice of flesh, a grand making visual video of Thangalaan as our humble tribute to Chiyaan.https://t.co/0cxHldw8Nc#HBDChiyaanVikram #ThangalaanMaking @chiyaan @kegvraja @StudioGreen2 @officialneelam pic.twitter.com/1CHLM4W3fT
ఆకట్టుకుంటున్న ‘తంగలన్’ మేకింగ్ వీడియో
విక్రమ్ బర్త్ డే సందర్భంగా 'తంగలన్' సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. విక్రమ్ కెరీర్ లో 61వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతోంది. వీడియోలో ప్రధానంగా విక్రమ్ పాత్రను హైలెట్ చేసింది. విక్రమ్ క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్న విజువల్స్ ను అద్భుతంగా చూపించారు. ‘తంగలన్’లోని పాత్రకు తగినట్లుగా విక్రమ్ తన బాడీని మలుచుకున్నారు. భారీగా బరువును తగ్గడంతో పాటు తన మజిల్స్ లో బలాన్ని తగ్గించుకున్నారు. డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు.
ఈ వీడియోను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇదో ఎపిక్ చిత్రం కాబోతోందని అభిప్రాయపడుతున్నారు. “అద్భుతమైన మేకింగ్ వీడియో. ఈ వీడియో చూస్తుంటే ఓ ఇతిహాసంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఈ చిత్రంలో మాళవిక చక్కటి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకు రెడీ అవుతోంది.
‘తంగలన్’ గురించి మాళవిక ఏమన్నదంటే?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక, ‘తంగలన్’లో తనకు అద్భుతమైన పాత్ర లభించినట్లు చెప్పుకొచ్చింది. అత్యంత కోపం కలిగిన యోధురాలిగా ఇందులో నటించినట్లు వెల్లడించింది. రంజిత్ పా, విక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో ఓ మైల్ స్టోన్ గా నిలవబోతుందని చెప్పుకొచ్చింది. నటుడిగా విక్రమ్ కు, దర్శకుడిగా రంజిత్ కు జీవితాంతం గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని వివరించింది.
‘కేజీఎఫ్’ గనుల్లోని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘తంగలన్’
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రూపొందింది. అయితే, అదే కేజీఎఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా ‘తంగలన్’ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం 3Dలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. అటు విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన అదిత కరికాలన్ పాత్రను పోషిస్తున్నారు.
Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?