OMG 2 Censor Cuts : అక్షయ్ కుమార్ సినిమాకు 20 కట్స్, 'A' సర్టిఫికెట్ - OMG 2 పెద్దలకు మాత్రమేనా?
అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2' సినిమాకి సెన్సార్ రివిజన్ కమిటీ షాకిచ్చింది. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓ మై గాడ్ 2' (OMG 2). అమిత్ రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ ఫాంటసీ డ్రామా, సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 20 కట్స్ తో 'ఎ' సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
'ఓ మై గాడ్ 2' చిత్రాన్ని 2023 ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అయితే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఈ మూవీని రివిజన్ కమిటీకి పంపించింది. దైవానికి సంబంధించిన అంశాలతో రూపొందించిన సినిమా కావడంతో ఎలాంటి అభ్యంతరాలకు తావు లేకుండా ఉండాలని బోర్డు భావించింది. ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు, డైలాగ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని నివేదించబడింది.
తాజా నివేదికల ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) రివైజింగ్ కమిటీ 'OMG 2' సినిమాని చూసి, తమ నివేదికను సమర్పించారు. చిత్రంలో కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు.. పలు సంభాషణలను తొలగించాలనే అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 కట్స్ తో అడల్ట్ సర్టిఫికెట్ ( 'ఎ' సర్టిఫికెట్) ఇవ్వాలని సూచించారట.
Read Also: ఆరేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించని ఇద్దరు టాలెంటెడ్ హీరోలు, ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా?
'ఓ మై గాడ్ 2' సినిమా సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. వివాదాలకు రేకెత్తించే అవకాశం ఉండటంతో ఆ ఇరవై కట్స్ సూచించారట. దానికి తగ్గట్టే, ఇది 'పెద్దలు మాత్రమే' చూసే చిత్రంగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రివీజన్ కమిటీ నిర్ణయంతో మేకర్స్ హ్యాపీగా లేరని తెలుస్తోంది. సెక్స్ ఎడ్యుకేషన్ అంశాన్ని అన్ని వయసుల వారు చూడాలని భావిస్తున్నారట. అందుకే 'ఏ' సర్టిఫికెట్ జారీ చేస్తే కోర్టుకు వెళ్లే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
2012లో అక్షయ్ కుమార్ హీరోగా 'ఓ మై గాడ్' సినిమా రూపొందింది. బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన ఈ చిత్రం, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంది. అయితే అలాంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'ఓ మై గాడ్ 2' పెద్దలకు మాత్రమే పరిమితం అవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పటికైతే దీనిపై అటు హీరోగానీ ఇటు దర్శక నిర్మాతలు గానీ స్పందించలేదు.
OMG లో లార్డ్ కృష్ణగా నటించిన అక్షయ్ కుమార్.. 'ఓ మై గాడ్ 2' సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్, అరుణ్ గోవిల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' సినిమాకి పోటీగా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ అడ్డంకులు తొలగకపోతే మాత్రం అక్షయ్ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం వుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Read Also: నా తల్లి శ్రీదేవి వారసత్వమే దీనికి ప్రధాన కారణం - దక్షిణాది ప్రేక్షకులపై జాన్వీ కామెంట్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial