Animal: ‘యానిమల్’ను వెంకటేశ్ చిత్రంతో పోల్చిన నాని - సందీప్ స్పందన ఏంటంటే?
మామూలుగా ఒక సినిమా టీజర్ లేదా ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకులకు మరేదైనా సినిమా గుర్తురావడం సహజం. అలా ‘యానిమల్’ టీజర్ చూసినప్పుడు తనకు ‘ధర్మచక్రం’ గుర్తొచ్చిందని అన్నాడు నాని.
డిసెంబర్‌లో ఎన్నో తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో ముఖ్యంగా ‘యానిమల్’, ‘హాయ్ నాన్న’పైనే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. ఈ రెండు సినిమాలు.. రెండు వేర్వేరు కాన్సెప్ట్స్‌తో తెరకెక్కుతున్నాయి. రెండిటికీ అసలు సంబంధం లేదు. కానీ వీటికోసమే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో విడుదలయ్యి మంచి టాక్‌తో ముందుకెళ్తుండగా.. ఈ సినిమాను అలనాటి వెంకటేశ్ చిత్రంతో పోల్చాడు నేచురల్ స్టార్ నాని. దానికి సందీప్ రెడ్డి వంగా తెలివిగా సమాధానం కూడా ఇచ్చాడు.
సందీప్ వంగాతో నాని ఇంటర్వ్యూ..
‘యానిమల్’ ప్రమోషన్స్ కోసం రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడుతున్నారో.. ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ కోసం నాని కూడా అంతే కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతంగా హైప్ ఉండడంతో దానిని మరింత పెంచడం కోసం సందీప్ వంగా, నాని కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో హోస్ట్ అంటూ ఎవరూ లేరు. ఈ ఇద్దరు మాత్రమే వారి సినిమాల గురించి ప్రేక్షకులకు చెప్తూ వాటిని ప్రమోట్ చేసుకోవాలి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వారి సినిమాలపై ప్రేక్షకులకు మరింత క్లారిటీ వస్తోంది. అయితే ఇందులో ‘యానిమల్’ చిత్రాన్ని అలనాటి ‘ధర్మచక్రం’తో పోలుస్తూ మాట్లాడాడు నాని.
‘ధర్మచక్రం’తో పోలిక..
‘యానిమల్’ సినిమా టీజర్ చూసిన తర్వాత తనకు 1996లో విడుదలైన ‘ధర్మచక్రం’ గుర్తొచ్చిందని సందీప్‌తో పాల్గొన్న ఇంటర్వ్యూలో నాని బయటపెట్టాడు. వెంకటేశ్ హీరోగా నటించిన ‘ధర్మచక్రం’ కూడా ఒక తండ్రి, కొడుకుల అనుబంధంపై ఆధారపడిన సినిమానే. అందులో వెంకటేశ్ తండ్రి పాత్రలో మహేంద్ర కనిపించారు. ‘యానిమల్’లో కూడా రణబీర్ కపూర్, అనిల్ కపూర్.. తండ్రీకొడుకులుగా నటించగా.. వీరిద్దరి అనుబంధంపైనే ఎక్కువగా ఈ సినిమా ఆధారపడి ఉంటుంది. 1990ల్లో విడుదలైన చాలావరకు సినిమాల్లో తండ్రి పాత్రలు చాలా సాఫ్ట్‌గా ఉండేవని, ‘ధర్మచక్రం’ విడుదల తర్వాత తండ్రి పాత్రలు పూర్తిగా మారిపోయాయని నాని గుర్తుచేసుకున్నాడు.
ఆ సినిమాలు గుర్తులేదు..
కేవలం నాని మాత్రమే కాదు.. ‘యానిమల్’ టీజర్, ట్రైలర్ చూసిన చాలావరకు ప్రేక్షకులు కూడా దీనిని ఇంతకు ముందు విడుదలైన తండ్రి, కొడుకుల బంధం ఉన్న సినిమాలతో పోలుస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్న మరో ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి ప్రశ్నే తనకు ఎదురయ్యింది. ‘యానిమల్’ను ‘ధర్మచక్రం’, ‘కిరాతకుడు’ వంటి చిత్రాలతో పోలుస్తూ దానిపై సందీప్ అభిప్రాయాన్ని అడిగారు. అయితే ఆ సినిమాలకు, తన సినిమాకు చాలా తేడా ఉంటుందని, సినిమా చూస్తే ప్రేక్షకుల దృక్పథం కచ్చితంగా మారుతుందని అన్నాడు సందీప్. అంతే కాకుండా ‘ధర్మచక్రం’, ‘కిరాతకుడు’ వంటి సినిమాలు చాలాకాలం క్రితం చూశానని, వాటి గురించి తనకు సరిగ్గా గుర్తులేదని ఓపెన్‌గా చెప్పేశాడు. ఇక ఈ శుక్రవారం.. థియేటర్లలో విడుదలయిన ‘యానిమల్’కు అంతటా పాజిటివ్ టాక్ లభిస్తోంది.
Also Read: యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply