చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
తాత ఎన్టీఆర్ తో తన ప్రయాణం ఏడాది పాటు కొనసాగిందన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఏడాది కాలంలో తనను బంగారంలా చూసుకున్నారని చెప్పారు. చనిపోయే ముందు తాత తనతో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు.
తాత నందమూరి తారక రామారావు నుంచి రూపుతో పాటు అద్భుతమైన నటనను పునికి పుచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన నుంచి తనకు వచ్చిన గొప్ప వరాలు ఆయన పేరు, రూపు అని చెప్పారు జూనియర్. ఎన్టీఆర్ చనిపోవడానికి కేవలం ఏడాది ముందు ఆయన్ని కలిశానని చెప్పారు. ఆ తర్వాత ఏడాది పాటు తనను బంగారం మాదిరిగా చూసుకున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన పాత మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే..
నన్ను చూడగానే పేరు మార్చాలని నాన్నతో చెప్పారు!
“ఒకరోజు ఆయనను చూడటానికి వెళ్లాను. ఆయన చుట్టూ తెలియని దైవత్వం, ఆయన నివసించే పరిసరాల్లో మొక్కలు, గాలిలోనూ దైవత్వం కనిపిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్తుంటే గుడిలోకి వెళ్తున్నామనే ఫీలింగ్ కలిగింది. తొలిసారి ఆయనను చూసేందుకు నడుచుకుంటూ మెట్ల మీది నుంచి వెళ్లాను. కాషాయపు వస్త్రాల్లో కిందే కూర్చొని ఉన్నారు. ఆయనలో ఒక తేజస్సు కనిపించింది. నన్ను చూసి రండి అన్నారు. ఆయన మాట వినగానే తెలియని తన్మయత్వం వచ్చింది. వెళ్లి ఆయన ముందు కూర్చున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్? అన్నారు. చిన్న పిల్లలు పాఠాలు అప్పజెప్పినట్లు మై నేమ్ ఈజ్ తారక రామ్ అన్నాను. ఎన్టీఆర్ గారు తన కొడుకులందరికీ కృష్ణ అనే పేరు పెట్టారు. మా నాన్న అందరికీ రామ అనే పేరు పెట్టారు. నన్ను చూసిన వెంటనే నాన్నను హరీ అని పిలిచారు. వెంటనే నాన్న వచ్చారు. అబ్బాయి పేరు మార్చాలి. నందమూరి తారక రామారావు అని పెట్టాలి అన్నారు. నాన్న అలాగే అన్నారు. ఆ రోజు నుంచి ఏడాది పాటు ఆయనతోనే అనుబంధం ఉండేది. ఆయన నన్ను బంగారంలా చూసుకునే వారు. రోజూ పొద్దున్నే వెళ్లేవాణ్ణి. ఆయనతోనే కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసే వాడిని. భోజనం చేసే వాడిని. ఆయనే నన్ను సినిమాల్లో నటించాలని చెప్పారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో భరతుడి వేషం వేయించారు. నాతో దగ్గరుండి డబ్బింగ్ చెప్పించారు. ఆయన మాదిరిగానే నాకు మసాజ్ చేయించే వారు. స్నానం చేయించే వారు. నాకు దగ్గరుండి భోజనం పెట్టేవారు. ఆ తర్వాత అమ్మ దగ్గర నుంచి క్యారేజీ వచ్చేది” అని చెప్పారు.
అమ్మతో తాత చెప్పిన మాటలు ఎప్పటికీ మరువలేను
“కొద్ది రోజుల ఆర్వాత అమ్మను పిలిపించారు. అమ్మ కిందే కూర్చుంది. ఎదురుగా తాత కూర్చున్నారు. పక్కనే నేను కూర్చున్నాను. ఇంతకాలం దూరంగా ఉన్నావు. దాని గురించి పట్టించుకోకండి. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటి వాడికి అతడిని తీర్చి దిద్దడంలో నీవంత బాధ్యత నువ్వు నిర్వర్తించమ్మా, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. అప్పుడే నాకు కోపం వచ్చింది. నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పి వెళ్లిపోయారు అని. అప్పుడే నాకో దిక్కు దొరికింది అనే ధైర్యం వచ్చిన తరుణంలోనే ఆయన చనిపోయారు. కానీ, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఆయన నాకు మూడు అక్షరాలు ఇచ్చారు. NTR అనే పేరు, ఆయన పోలికలు. ఇంక అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఆయన ఆశీర్వాదం ఉంది. ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు. మా అమ్మ వంతు బాధ్యత ఆమె నిర్వర్తించింది. నావంతు బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.