Sreeleela: శ్రీలీల ఖాతాలోకి మరో బిగ్ ప్రాజెక్ట్ - క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ!
యంగ్ బ్యూటీ శ్రీలీలకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ఆమె చేతిలో 9 - 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం.
2019లో 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల.. 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన లుక్స్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ లు, గ్లామర్ షోతో యువ హృదయాలను కొల్లగొట్టింది. దీంతో దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలో తెలుగు కన్నడ భాషల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది.
గతేడాది చివర్లో రవితేజతో కలిసి చేసిన 'ధమాకా' చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి శ్రీలీలా కూడా ఒక కారణమని చెప్పాలి. ఆమె తన నటనతో డ్యాన్స్ లతో సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్లలో ఒకటిగా నిలిచింది. ఆమె ఎనర్జీ లెవల్స్ కి అందరూ ముగ్ధులయ్యారు. దీంతో కుర్ర భామ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
ఇప్పుడు తెలుగులో మీడియం రేంజ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ అందరికి ఈ కన్నడ కస్తూరీనే ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. శ్రీలీలకు ఉన్నంత డిమాండ్ టాలీవుడ్ లో మరే హీరోయిన్ కు లేదనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం చేతిలో 9 - 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయంటేనే ఆమెకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న #SSMB28 మూవీలో శ్రీ లీలా భాగం అవుతోంది. ఇందులో పూజా హెగ్డేతో పాటుగా హీరోయిన్ గా ఎంపికైంది. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న #NBK108 చిత్రంలో నందమూరి బాలకృష్ణకు కూతురిగా శ్రీలీల కనిపించనుంది.
ఉస్తాద్ రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీలోనూ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. యూత్ స్టార్ నితిన్ - వక్కంతం వంశీ కలిసి చేస్తున్న #Nithin32 సినిమాలో కూడా ఈ అందాల భామే కథానాయిక. 'అనగనగా ఒక రాజు' అనే చిత్రంలో యువ హీరో నవీన్ పోలిశెట్టితో రొమాన్స్ చేస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా చేస్తున్న #PT04 సినిమాలో శ్రీలీల లీడ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్ర బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా లాంచ్ అవుతున్న 'జూనియర్' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ & హరీశ్ శంకర్ కలయికలో రూపొందనున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీ లీలను తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్స్ నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా సితార బ్యానర్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అమ్మడి ఖాతాలోకే వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీలను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇలా శ్రీలీల చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కోసం ఈ బ్యూటీతో చర్చలు జరుగుతున్నాయి. ఈ లైనప్ చూస్తుంటే, రాబోయే రెండేళ్ల వరకూ ఆమె డేట్స్ కి భారీ డిమాండ్ ఉంటుందనే చెప్పాలి. దీనికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : అమెరికాలో కాదు, అపోలోలో ఉపాసన డెలివరీ - ఇండియన్ డాక్టర్లకు తోడు అమెరికన్ గైనకాలజిస్ట్