Dil Raju: మాదంతా క్లీన్... కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పే - దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
దిల్ రాజును ఐటీ శాఖ టార్గెట్ చేసిందనే వార్తల మీద ఆయన స్పందించారు. మూడు రోజులుగా ఆయన ఇంటిపై జరిగిన సోదాల గురించి విలేకరుల సమావేశంపై నిర్వహించారు. ఇందులో ఏమన్నారంటే...

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాత, సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలను తెలంగాణతో పాటు ఉత్తరాంధ్రలో డిస్టిబ్యూట్ చేసిన 'దిల్' రాజు (Dil Raju)ను ప్రభుత్వం లేదంటే ప్రభుత్వ అధికారులు టార్గెట్ చేశారా? అంటే... 'లేదు' అని ఆయన సమాధానం చెప్పారు. నాలుగు రోజులగా తమ ఆఫీసులతో పాటు ఇళ్లలోనూ జరిగిన ఐటీ రైట్స్ గురించి విలేకరుల సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు.
నేను టార్గెట్ అవ్వలేదు... పెద్ద ఎత్తున డబ్బు దొరకలేదు!
ఐటీ శాఖ రైట్ తర్వాత తనను టార్గెట్ చేశారని వచ్చిన వార్తల మీద దిల్ రాజు స్పందించారు. తాను ఏమీ టార్గెట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రైడ్ సాధారణంగా జరిగే ప్రాసెస్ అని, తమ ఆఫీసుల్లో ఈ విధమైన సెర్చ్ జరిగి 18 ఏళ్లు అయ్యిందని, అందువల్ల రైడ్ చేశారని 'దిల్' రాజు వివరించారు.
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) రైడ్ గురించి 'దిల్' రాజు మాట్లాడుతూ... ''నాలుగు రోజులుగా మా ఇళ్ళలోనూ ఆఫీసుల్లోనూ సోదాలు జరిగాయి. మా దగ్గర భారీ ఎత్తున డబ్బు ఎవరి డాక్యుమెంట్స్ దొరికాయని కొంతమంది వార్తలు వేశారు. అదంతా అవాస్తవం. మా వద్ద కేవలం 20 లక్షల రూపాయల నగదు మాత్రమే లభించింది. గత ఐదేళ్లుగా మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. మా డాక్యుమెంట్స్ అన్నీ ఐటీ శాఖ చెక్ చేశారు. చివరకు వాళ్లు ఆశ్చర్యపోయారు. మాదంతా క్లీన్'' అని వివరించారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమని చెప్పారని, తమ ఆడిటర్లు వెళ్లి కలుస్తారని 'దిల్' రాజు తెలిపారు.
కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం తప్పు!
ఇండస్ట్రీలో పలువురు నిర్మాతల మీద ఆదాయపు పన్ను శాఖ రైడ్ చేయడంతో ఒక్కసారిగా ఊహాగానాలు మొదలు అయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో తెలుగు చిత్ర సీమను ప్రభుత్వాలు టార్గెట్ చేశాయా? అనే ప్రచారం జరిగింది. అటువంటి ఊహాగానాలకు 'దిల్' రాజు చెక్ పెట్టారు. ఎక్కువగా ఊహించుకోవద్దని, ఎటువంటి హడావిడి లేదని, ఇండస్ట్రీలో అంతా ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని ఆయన వివరించారు.
అగ్ర హీరోలకు చెందిన సినిమాలు విడుదలైన సమయంలో కలెక్షన్లు ఎక్కువ చేసి చూపించడం ఇండస్ట్రీలో సహజంగా జరిగేది. ఆ ధోరణిపై 'దిల్' రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అది తప్పు అని, ఆ తీరును మార్చుకోవాలని, ఇండస్ట్రీ అంతా కూర్చుని ఆ అంశం మీద మాట్లాడతామని 'దిల్' రాజు పేర్కొన్నారు.
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్లే ఆసుపత్రికి
'దిల్' రాజు ఆఫీసులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్ల మీద ఐటీ రైడ్ జరిగిన తర్వాత ఆయన తల్లి ఆసుపత్రి పాలయ్యారు. ఐటీ సోదాల వల్ల ఆవిడ అనారోగ్యానికి గురయ్యారని ప్రచారం కూడా జరిగింది. దాని మీద కూడా 'దిల్' రాజు స్పందించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల తన తల్లి ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారని, అంతకు మించి ఏమీ లేదని, ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్, SSMB29 షూటింగ్ షురూ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

