Bandla Ganesh Speech: ఇది అస్సలు బాలేదన్నా - పూరి జగన్నాథ్‌పై బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తన కెరీర్‌లో ఎందరినో స్టార్ హీరోలను చేసిన పూరి జగన్నాథ్ ఆకాశ్ పూరి ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే నటుడు, నిర్మాత మరోసారి మాటల తూటాలు పేల్చారు. ఈసారి ఆయన పూరి జగన్నాథ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో మందిని స్టార్ హీరోలను చేసిన పూరి జగన్నాథ్.. కన్నకొడుకు ఆకాశ్ పూరి ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చోర్ బజార్’. ఈ సినిమా జూన్ 24న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఒక సామెత ఉంటుంది.. దేశం మొత్తం కళ్లాపి చల్లాడు కానీ.. ఇంటి ముందు కళ్లాపి చల్లడానికి టైం లేదని. ఇప్పుడు పూరి జగన్నాథ్‌ను చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని ఆయన స్టార్స్‌గా తయారు చేశాడు. డైలాగ్‌లు రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు, డాన్స్ రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేకపోయాడు.’
‘అదే నేనైతే లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయద్దు. ఎందుకంటే మనం ఏం చేసినా పిల్లల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది పిల్లలే. మనం సంపాదించే ఆస్తులు వాళ్లకే, అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే.’
’ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరి జగన్నాథ్... నువ్వు ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ఎక్కడో ముంబైలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం? నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా తను స్టార్ అవుతాడు. చోర్ బజార్ సినిమా పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది. నువ్వు బ్యాంకాక్ వెళ్లి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది. అలా జరక్కపోతే నా పేరు అసలు బండ్ల గణేష్ కాదు. ఆరోజు ఆకాశ్ నువ్ డేట్‌లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram