Jagan Tollywood Meet : నాలుగో తేదీన టాలీవుడ్ పెద్దలతో ఏపీ సీఎం జగన్ భేటీ !
ఏపీలో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కానికి ముందడుగు పడుతోంది. నాలుగో తేదీన సీఎం జగన్‌తో చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యే అవకాశం ఉంది.
తెలుగు చిత్ర సీమను కరోనా కష్టాలు వదిలి పెట్టడం లేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సినిమాలు విడుదల చేసుకునే పరిస్థితి రాలేదు. దీంతో పెద్ద సినిమాలు ఇంకా ల్యాబ్‌లలోనే ఉంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చుకునేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అక్కడ సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుగా సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ సమస్యలపై చర్చించేందుకు రావాలని ఆహ్వానించారు. మంత్రి పేర్ని నాని కూడా హైదరాబాద్ వచ్చి టాలీవుడ్ పెద్దలతో భేటీ అయి.. చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేసుకుని వెళ్లారు. నాలుగో తేదీన సీఎం జగన్ సమయం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరుక టాలీవుడ్ పెద్దలకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.
సెప్టెంబర్ 4వ తేదీన జరగనున్న సమావేశంలో చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ టీం వెళ్లనుంది. నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబులతో పాటు ఇతర సినీ సంబంధిత వ్యాపార వర్గాల ప్రతినిధుల్ని కూడా సమావేశానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ధియేటర్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఎక్కువగా ధియేటర్లు సరిగ్గా నడవడం లేదు. ఈ కారణంగా ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోయారు. అదే సమయంలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను తగ్గించేసింది. దీంతో ధియేటర్లకు వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోతుంది. ఇదే ప్రధానమైన సమస్యగా ఉంది.
ఇప్పటికే చిరంజీవి ఒకటి రెండు సార్లు ముఖ్యులతో సమావేశం నిర్వహించి సీఎం జగన్‌తో భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఓ క్లారిటీకి వచ్చారు. వకీల్ సాబ్ విడుదల సమయంలో ప్రభుత్వం టిక్కెట్ రేట్లను పరిమితం చేస్తూ జీవో ఇచ్చింది. ఆ వివాదం నడుస్తున్న సమయంలోనే కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ ధియేటర్లు తెరుచుకోలేదు. ఇటీవల తెరవడానికి ప్రభుత్వం నిబంధనలు సడలించింది. కానీ కొన్ని ధియేటర్లు మాత్రమే తెరిచారు. పెద్ద సినిమాలు విడుదలైతే కానీ మిగతా ధియేటర్లు తెరిచే పరిస్థితి లేదు.
అక్టోబరులో పెద్ద సినిమాల విడుదలకు రంగం సిద్దమవుతోంది. అందువల్ల ఈలోపు చర్చలు పూర్తి చేసి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను సిద్ధం చేయించాలన్న యోచనలో సినీ పెద్దలు ఉన్నారు. సీఎం జగన్ సమస్యల పరిష్కారానికి చూపే స్పందనను బట్టి ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ఆచార్య, బాలకృష్ణ అఖండతో పాటు పలు సినిమాలు రిలీజ్‌కు దగ్గరలో ఉన్నాయి. అందుకే సినీ పరిశ్రమ ఈ భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.