Actor Suresh: చాలామంది నా కొడుకును హీరో చేయమన్నారు - తిండి తినకుండా ఫొటోలతో ఆఫీసులు చుట్టూ తిరిగా: నటుడు సురేష్
Actor Suresh: ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన నటుడు సురేశ్. ఇక తన తర్వాత తన వారసుడిగా కొడుకును హీరో ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
Actor Suresh: ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి, అప్పటి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన యాక్టర్ సురేష్. హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న తర్వాత వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి కూడా వెనకాడలేదు ఈ నటుడు. అలా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన సురేష్.. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. తాజాగా ‘నీ దారే నీ కథ’ అనే ఫీల్ గుడ్ సినిమాలో మరోసారి హీరోకు తండ్రిగా కనిపించనున్నారు సురేష్. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ తన సొంత కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎప్పటికీ సపోర్ట్ చేస్తాను..
చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న సురేష్.. ‘నీ దారే నీ కథ’ ఆఫర్‌ను ఒప్పుకోవడానికి కారణమేంటో బయటపెట్టారు. ‘‘నా రియల్ లైఫ్‌కు ఈ పాత్ర కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే మా కొడుకు పేరు నిఖిల్. అందరూ వచ్చి తను హీరో అవ్వాలి, చూడడానికి బాగున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం నేను తనతో పర్సనల్‌గా మాట్లాడాను. ఏం అవ్వాలి అనుకుంటున్నావు అని అడిగాను. నేను జనాల్లో అంత సౌకర్యంగా ఉండను. నన్ను వదిలేస్తే బెటర్. నీ దారి నీ కథ, నా దారి నా కథ అన్నాడు. నేను కూడా సరే అన్నాను. తను ఏం ఎంచుకున్నా నాకు ఓకే. ఏదైనా తనకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను’’ అని తన కొడుకు గురించి చెప్పుకొచ్చారు సురేష్.
అచ్చం నాలాంటి క్యారెక్టర్..
‘‘నీ దారే నీ కథ స్టోరీ చెప్పడానికి దర్శకుడు నాకు ఫోన్ చేసినప్పుడు దాదాపుగా ఇవే మాటలు చెప్పారు. అయితే ఈ సినిమాలో నేను చేయగలను అని నమ్మకం వచ్చి తప్పకుండా చేస్తానని చెప్పాను. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అసలు యాక్ట్ చేస్తున్న ఫీలింగే రాలేదు. నేను ఇందులో ఎప్పుడూ హ్యాపీగా ఉండే ఒక తండ్రి పాత్రలో కనిపించనున్నాను. పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయనివ్వాలి అన్నట్టుగా ఉంటుంది నా క్యారెక్టర్. అదే నా డైలాగుల్లో కూడా కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అచ్చం నాలాగే ఉంది’’ అంటూ ‘నీ దారే నీ కథ’లోని పాత్ర గురించి బయటపెట్టారు సురేష్.
అది ఎవరికీ తెలియదు..
ఇక ప్యాషన్, కెరీర్.. రెండే వేర్వేరు కావాల్సిన అవసరం లేదని సురేష్ అన్నారు. ‘‘నాతో కలిసి చదువుకున్న వాళ్లంతా ఇప్పుడు వేర్వేరు కంపెనీల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. అందులో ఒకరిద్దరు నాకు ఫోన్ చేసి నేను రిటైర్ అయ్యాను, ఏవైనా వేషాలు ఉంటే చెప్పు, నాకు మొదటినుండి ఇంట్రెస్ట్, ప్యాషన్ అన్నారు. అది ఎప్పుడో చేసుండాల్సింది అని చెప్పాను. ఇక్కడికి వచ్చి ప్రయత్నిస్తే ఏదైనా వర్కవుట్ అవుతుందేమో అని చెప్పడం వల్ల నేనేం చేయలేను. నేను తిండి తినకుండా, ఫొటోలతో ఆల్బమ్ రెడీ చేసుకొని, 40, 50 ఆఫీసులు తిరిగిన తర్వాత నాకు మొదటి అవకాశం వచ్చింది. అది చాలామందికి తెలియదు. ఒకవేళ ప్యాషన్ ఫాలో అవ్వాలనుకుంటే దానికి తగిన త్యాగాలు కూడా చేయాలి’’ అని గుర్తుచేసుకున్నారు సురేష్.