Ravan: తమిళ సినిమాల్లో రావణుడే హీరో, లంకేశ్వరుడిపై ఎందుకంత సాఫ్ట్ కార్నర్? అసలు కారణం అదేనా?
తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పటికీ రావణుడి పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. ఆయనను పలువురు తమిళ దర్శకులు హీరోగా చూపించే ప్రయత్నం చేశారు. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ ఇతిహాసం రామాయణంలోని పాత్రలను చూసే విధానంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాదిరిగా ఉన్నాయి. కొన్ని చోట్ల రాముడిని దేవుడిగా భావిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో రావణుడి పట్ల సాఫ్ట్ కార్నర్ ను కలిగి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సీతాదేవిని భారతీయులు భారత బిడ్డగా చూసుకుంటే, నేపాలీలు తమ కూతురుగా భావిస్తారు. భౌగోళ పరిస్థితులకు అనుగుణంగా రామయణంలోని పాత్రలను ఆయా ప్రాంతాల ప్రజలు తమకు నచ్చిన రీతిలో కొలుస్తున్నారు.
రాక్షసరాజును గొప్పగా అభివర్ణించిన ఆనంద్ నీలకంఠన్
తమిళ సినిమా పరిశ్రమలో మాత్రం రావణుడిని చూపించే విధానంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. బాలీవుడ్ తో పోల్చితే, కోలీవుడ్ లో పూర్తి వ్యతిరేకంగా చిత్రీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రావణుడిని హీరోగా చూపించారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆనంద్ నీలకంఠన్ రాసిని ‘అసుర: టేల్ ఆఫ్ ది వాంక్విష్డ్‘ అనే పుస్తకంలో రాక్షస రాజును చూపించే విధానం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నీలకంఠన్ కేరళకు చెందిన రచయిత. దక్షిణాదిలో రావణుడి పట్ల సానుభూతి చూపే వ్యక్తి మాత్రమే కాదు, రావణుడు దక్షిణాది ప్రజల రాజుగా ఆయన భావించారు. అదే విషయాన్ని ఈ పుస్తకంలో ఘంటాపథంగా చెప్పుకొచ్చారు.
‘ఎలంగేశ్వరన్’ చిత్రంలో సీత రావణుడి కూతురు!
తమిళ సినిమా ‘లంకేశ్వరన్‘లోనూ రావణుడిని హీరోగా చూపించే ప్రయత్నం చేశారు. 1987లో ‘ఎలంగేశ్వరన్’ పేరుతో ఈ సినిమాను మళ్లీ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు టిఆర్ రామన్న దర్శకత్వం వహించారు. రాజేష్ రావణుడిగా నటించిన ఈ చిత్రంలో సీత రావణుడి కుమార్తె అని చూపించడం విశేషం. ఈ సినిమా రావణుడు తన కూతురు పుట్టిన రోజు వేడుకతో సినిమా ప్రారంభం అవుతుంది. తన రాజ్యం అంతా ఈ వేడుక నిర్వహిస్తాడు. తన నవజాత శిశువు జ్యోతిష్యాన్ని చూపించేందుకు బ్రహ్మను పిలుస్తాడు. ఆ అమ్మాయి తన రాజ్యానికి కీడు తీసుకొస్తుందని, ఆమె లంకలో ఉండకూడదని బ్రహ్మ చెప్పాడు. బరువెక్కిన హృదయంతో, రావణుడు ఆమెను ఒక చెక్క పెట్టెలో ఉంచి, ఆమెను సముద్రంలో పడేస్తాడు. ఆ తర్వాత రామాయణ కథను చూపిస్తారు. అంతేకాదు, ఈ సినిమాలో కూతురు కోసం పరితపించే తండ్రిగా రావణుడిని చూపిస్తారు. వాస్తవానికి ఈ సినిమా చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అంతేకాదు, రావణుడి చర్యలను సమర్థించే ప్రయత్నం చేయడంతో సినిమా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటుంది.
‘రావణన్’లోనూ రావణుడిని సాఫ్ట్ గా చూపించిన మణిరత్నం
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రావణన్’(2010) సినిమాలోనూ రావణుడి గుణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. IPS అధికారి దేవ్ ప్రకాష్ సుబ్రమణ్యం (పృథ్వీరాజ్) భార్యను అపహరించిన వీర (విక్రమ్) అకా కథ సేమ్ రావణుడి కథగానే అనిపిస్తుంది. ఐశ్వర్య రాయ్ ఆపదలో ఉన్న మహిళ రాగిణి సుబ్రమణ్యం పాత్రను పోషించింది. ఈమె పాత్ర సీత పాత్రను పోలి ఉంటుంది. వీర, రాగిణిని అపహరించడానికి కారణంగా అతడి సోదరి వెన్నెల(ప్రియమణి)ను వేదించడం. ప్రియమణి పాత్ర శూర్పణక క్యారెక్టర్ మాదిరిగా ఉంటుంది. సినిమాలో దేవ్ కంటే వీర రాగిణిని మరింత గౌరవంగా చూస్తాడు. రావణుడు సైతం సీత పట్ల ఇదే ప్రేమను చూపించాడు అని ఈ సినిమాలో మణిరత్నం చెప్పే ప్రయత్నం చేశారు.
కాలాలో కనిపించిన ‘రావణకవియం’ పుస్తకం
ఇటీవల పా రంజిత్ తెరకెక్కించిన ‘కాలా’ కూడా పరిశీలించి చూస్తే రామాయణం బేస్ చేసుకుని తీసినట్లుగా ఉంటుంది. అయితే, అసలు రామాయణానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కాలాను ఈ సినిమాలో పది తలల రావణుడిగా చూపిస్తారు. ఒక సన్నివేశంలో, తమిళ పుస్తకం ‘రావణకవియం’ కాలా టేబుల్‌పై కనిపిస్తుంది. ద్రావిడ కవి పులవర్ కుజాంధై రచించిన ఈ పుస్తకం 1946లో వచ్చింది. ఇది ఆర్య రాజు అయిన రాముడి చేత చంపబడిన రావణుడిని దక్షిణ హీరోగా అభివర్ణిస్తుంది. రాముడు, అతని కుటుంబాన్ని విలన్‌లుగా చూపిస్తుంది.
తమిళనాడుపై పెరియార్ రామాయణ ప్రభావం
రావణుడిపై తమిళవాసులకు సాఫ్ట్ కార్నర్ ఉండటానికి అసలు కారణం ద్రావిడ ఉద్యమం, పెరియార్ రామాయణం. ద్రావిడ కజగం వ్యవస్థాపకుడు పెరియార్, రామాయణం దక్షిణాది ప్రజలను రాక్షసులుగా చిత్రీకరిస్తుంది, ఉత్తర భారతీయులను కీర్తిస్తుందని వాదించారు. అతడి రామాయణం ప్రకారం, రాముడు ఒక ఆర్యన్ రాజు. అతడు దక్షిణాది రాజు అయిన రావణునిపై దాడి చేసి చంపాడు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన రావణుడిపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది.
Read Also: 'ఆదిపురుష్'కు ఫ్లాప్ టాక్ వెనుక టాప్ 5 రీజన్స్ - ఏంటిది ఓం రౌత్?