Chiranjeevi - Tammareddy: పరువు తీశావయ్యా చిరంజీవి, జగన్‌ను అడుక్కోవాలా? తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ముసలం మొదలైందా? తాజా పరిణామాలు చూస్తుంటే 'అవును' అనిపిస్తోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ముసలం మొదలైందా? మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొంత మంది స్టార్ హీరోలు, దర్శకులు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలవడం పట్ల కొంత మంది అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రితో సమావేశంలో చిరంజీవి వ్యవహరించిన తీరు ఇండస్ట్రీలో జనాలకు నచ్చడం లేదా? తాజా పరిణామాలు చూస్తుంటే 'అవును' అనిపిస్తోంది. ఆల్రెడీ స్టార్ హీరోలు బిక్ష అడిగారని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఇండస్ట్రీ పరువు తీశావని ఆయన వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య ఏదో ఉందనే అపోహలను తొలగించిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు అంటూనే... ఇండస్ట్రీ పరువు తీశారని తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు.
"చిరంజీవి గారు మెగాస్టార్. మేం పెద్ద అంటాం. ఆయన బిడ్డ అంటారు. పెద్ద అయినా... బిడ్డ అయినా... ఆత్మా గౌరవం ఉంటుంది. ఎన్టీ రామారావు గారి పాట ఉంటుంది... 'ఎవరికీ తల వంచకు... ఎవరినీ యాచించకు' అని! చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. స్వతహాగా చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి. అటువంటి ఆయన ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసినప్పుడు... లీక్ అయిన వీడియో చూస్తే యాచించినట్టు ఉంది. బాధ వేసింది. మనం ఇంత స్టేజిలో ఉన్నామా? ఇంతా అక్కడికి వెళ్లి మాట్లాడింది ఏంటి? టికెట్ రేట్స్ పెరగాలని! టికెట్ రేట్స్ కాదు కదా, ఇండస్ట్రీ సమస్యలు గురించి కూడా మాట్లాడాలి కదా! ఇండస్ట్రీ నుంచి మనం అడిగిన కోరికలు 10, 15 ఉన్నాయి. వాటి అన్నిటి గురించి చర్చించి ఉంటే... సంతోషించేవాళ్ళం. మనం అడిగినవన్నీ ఆయన ఒకే చేసి ఉంటే సంతోషించేవాళ్ళం. ఏమీ లేకుండా థియేటర్స్ - టికెట్ రేట్స్ ఏంటి?" అని తమ్మారెడ్డి భరద్వాజ సొంత యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.
ఏపీలో టికెట్ రేట్స్ పెంచడం వల్ల 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాకు పాతిక కోట్ల రూపాయలు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని, పాన్ ఇండియా మొత్తం మీద ఆ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని, అందులో ఈ 25 కోట్లతో ఏం తేడా వస్తుంది? దాని కోసం ఇండస్ట్రీకి తల మానికమైన వ్యక్తులు వెళ్లి యాచించాలా? అడుక్కోవాలా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి ఆలోచించకుండా అడుక్కునే విధంగా మాట్లాడటం బాధగా ఉందని ఆయన అన్నారు. చిన్న సినిమాకు థియేటర్లలో మూడో షో కావాలని, అలా ఇచ్చి ఉంటే సంతోషమన్నారు. చిరంజీవి అంతటి పెద్ద మనిషి అంత రిక్వెస్ట్ చేస్తూ అడగటం బాధగా అనిపించిందన్నారు.
Also Read: 'ఫ్యామిలీ మాన్ 2'లో సమంత చేసినట్టు పూనమ్ కౌర్ చేసిందా?
Also Read: 'డీజే టిల్లు' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?