Maruthi SKN Gifts Car Sai Rajesh : సినిమా విడుదలకు ముందే దర్శకుడికి కారు గిఫ్టుగా ఇచ్చిన నిర్మాతలు
సినిమా విడుదలైన తర్వాత, భారీ విజయం సాధించాక... దర్శకులకు నిర్మాతలు బహుమతులు ఇవ్వడం కామన్. కానీ, విడుదలకు ముందే దర్శకుడికి నిర్మాత కారును గిఫ్టుగా ఇవ్వడం విశేషం.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో, ఆ మాటకు వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ట్రెడిషన్ ఉంది. అదేంటంటే... గిఫ్టులు ఇవ్వడం! సినిమాకు గుమ్మడికాయ కొట్టేసే రోజున... షూటింగ్ లాస్ట్ డే యూనిట్‌లో కీలక సభ్యులకు హీరో హీరోయిన్లు కొందరు గిఫ్టులు ఇస్తుంటారు. సినిమా విడుదలైన తర్వాత, భారీ విజయం సాధించాక... ఆ విజయానికి కారణమైన దర్శకుడికి నిర్మాత గిఫ్టులు ఇస్తుంటారు. కానీ, సినిమా విడుదలకు ముందే దర్శకుడికి నిర్మాతలు గిఫ్ట్ ఇవ్వడం విశేషం!
అప్పుడు మారుతి గిఫ్ట్ తీసుకున్నారు!
ఇప్పుడు మరో దర్శకుడికి ఇచ్చారు!
'ప్రతి రోజూ పండగే' విడుదలైన తర్వాత దర్శకుడు మారుతికి నిర్మాతలు రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు మారుతి తాను ఓ నిర్మాతగా తీస్తున్న సినిమా దర్శకుడికి విడుదలకు ముందే కారును బహుమతిగా ఇచ్చారు. అసలు వివరాల్లోకి వెళితే...
ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'బేబీ' (Baby Telugu Movie). సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కె.ఎన్ (Producer SKN), దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవతరం ప్రేమకథగా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రషెస్ చూసిన తర్వాత సాయి రాజేష్‌కు ఎంజీ హెక్టార్ ప్లస్ కారును గిఫ్టుగా ఇచ్చారు. తమకు చెప్పిన కథను చెప్పిన దాని కంటే అద్భుతంగా తెరకెక్కించినందుకు గాను ఆనందంతో ఈ బహుమతిని అందించారట.
''బాగా తీశా అనే ఇష్టమో... హిట్ కొట్టాల్సిందే అనే బ్లాక్ మెయిలో... మా నిర్మాతలు మాకు ఎంజీ హెక్టార్ ప్లస్ కారు బహుమతిగా ఇచ్చారు. లవ్ యు మారుతి, ఎస్.కె.ఎన్! త్వరలో 'బేబీ' టీజర్ విడుదల చేస్తాం. ఈసారీ నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి'' అని సాయి రాజేష్ ట్వీట్ చేశారు.
Baagaa theesaa ane ishtamo.....Hit kottalsindhe ani blackmail o ...My producers gifted me #MGHectorPlus car ... love you guruji @DirectorMaruthi and My Friend @SKNonline 🤗🤗🤗#Baby teaser soon ❤️
— Sai Rajesh (@sairazesh) October 13, 2022
Iam confident this time too...Need all your support pic.twitter.com/g5TPyxAHPo
'బేబీ' సినిమాలో విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్'తో వైష్ణవి చైతన్యకు మంచి పేరు వచ్చింది. ఆ యూట్యూబ్ సిరీస్ కంటే ముందు 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్ర చేశారు. తమిళంలో అజిత్ సినిమాలో ఒక పాత్ర చేశారు. మరికొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానున్నారు. 'బేబీ' చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'కలర్ ఫోటో' సినిమా ఇటీవల 68వ జాతీయ సినిమా పురస్కారాలలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సాయి రాజేష్ కథ రచయిత, నిర్మాత. 'ఈ రోజుల్లో', 'టాక్సీవాలా', 'మంచి రోజులొచ్చాయి' చిత్రాలతో విజయాలు అందుకున్న ఎస్.కె.ఎన్... ఆ చిత్రాల తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది.
Also Read : హైదరాబాద్‌లో తాలిబన్ పాలన - కేసీఆర్, కేటీఆర్‌ను టచ్ చేసిన ఆర్జీవీ